
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
రాయచోటి: ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రాధాన్యతగా పరిగణించి పరిష్కరించేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్, జాయింట్ కలెక్టర్ ఆదర్శరాజేంద్రన్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో గ్రీవెన్స్ డే కార్యక్రమంలో వారు ఉద్యోగుల సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పారదర్శకంగా పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉద్యోగులు తమ బాధ్యతలను గుర్తించి మరింత సమర్థవంతంగా పని చేయాలని ఆదేశించారు. వేతనాల చెల్లింపు, బదిలీలకు సంబంధించిన అర్జీలే అధికంగా వచ్చినట్లు తెలిపారు. అన్ని సమస్యలను శ్రద్ధగా విని సంబంధిత శాఖాధికారులను తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పరిష్కార చర్యలు
వివిధ మండలాల నుంచి ఐదుగురు వీఆర్‌ఓలు డిప్యుటేషన్ నిమిత్తం దరఖాస్తు చేసుకోగా కలెక్టర్ అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని డీఆర్‌ఓకు ఆదేశాలు జారీ చేశారు. వివిధ కారణాలతో సస్పెండ్ అయిన నలుగురు ఉద్యోగులను రీ–ఇన్షియేషన్ చేసేందుకు ఫైల్ సర్క్యూట్ చేయాలని డీఆర్‌ఓను ఆదేశించారు. పీటీఎం మండలంలో తహసీల్దార్ వీఆర్‌ఓగా విధుల్లో చేర్చుకోవడం లేదని బాధితుడు దరఖాస్తు సమర్పించగా.. వెంటనే విధుల్లో చేర్చుకోవాల్సిందిగా జారీ చేయాలని కలెక్టర్ డీఆర్‌ఓను ఆదేశించారు. వీఆర్‌ఓ మంజునాథ్ 2016లో పరీక్షల నిమిత్తం సెలవుపై వెళ్లినందుకు ఆ సెలవును రెగ్యులరైజ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డీఆర్‌ఓను ఆదేశించారు. డిజిటల్ అసిస్టెంట్ గోపాల్ నాయక్ కెవిపల్లి మండలం నుంచి పీలేరు ప్రాంత సమీపంలో మార్పు చేయాలని దరఖాస్తు చేసుకోగా తగు చర్యలు తీసుకొని మార్పు చేయాలని డీపీఓను కలెక్టర్ ఆదేశించారు. మరో ఇరవై మంది ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్‌కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి ఉద్యోగులకు భరోసా కల్పించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ మధుసూదన్ రావు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్రలో ముందుండాలి
స్వచ్ఛ ఆంధ్ర– స్వర్ణాంధ్రలో రాష్ట్రంలోనే మన జిల్లా ముందుండాలని కలెక్టర్ శ్రీధర్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్‌తో కలిసి స్వామిత్వ, శానిటేషన్, సాసా, కౌసల్యం సర్వే, హౌసింగ్, పెన్షన్ తదితర అంశాలపై రాజంపేట, మదనపల్లె ఆర్‌డీవోలతోపాటు ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. శానిటేషన్ మెరుగుదలకు ప్రతి 250 ఇళ్లకు ఒక గ్రీన్ ఎంబాసిటర్ నియామకం తప్పనిసరని సూచించారు. పంచాయతీ సెక్రటరీలు ప్రతి రోజు ఉదయం 6–8 గంటల మధ్య ఫీల్డ్ పరిశీలన చేసి చెత్తసేకరణ పర్యవేక్షణ చేయాలన్నారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రలో కాలేజీలు, పాఠశాలలు, హాస్టళ్లలో వ్యాసరచన పోటీలు నిర్వహించి, ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.