
అనుమానాస్పద మృతి కేసు హత్య కేసుగా మార్పు
మదనపల్లె రూరల్ : అనుమానాస్పదంగా మృతి చెందిన పశ్చిమబెంగాల్ యువకుడి కేసును పోస్టుమార్టం నివేదిక ఆధారంగా హత్యకేసుగా మార్పు చేస్తున్నట్లు రైల్వే సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. ఈనెల 16వ తేదీ సీటీఎం– అంగళ్లు రోడ్డులోని రైల్వే అండర్‌బ్రిడ్జి వద్ద ట్రాక్ పక్కన పశ్చిమబెంగాల్ ముషీరాబాద్ ఇమామ్‌నగర్‌కు చెందిన ఖదీర్(30) అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఘటనపై రైల్వేపోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా, పోస్టుమార్టం నివేదికలో ఖదీర్ హత్యకు గురైనట్లుగా నివేదిక అందింది. దీంతో రైల్వే పోలీసులు అనుమానాస్పద మృతి కేసును హత్యకేసుగా మార్పుచేశారు. అయితే ఈ కేసులో గంజాయి నిందితులు అనుమానితులుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేసుకు సంబంధించి ఇద్దరు అనుమానితులను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
అటవీ ఉద్యోగులపై
శ్రీశైలం ఎమ్మెల్యే దాడి అమానుషం
రాజంపేట : శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి , ఆయన అనుచరులు , విధులు నిర్వహిస్తున్న అటవీ ఉద్యోగులను కిడ్నాప్ చేసి, వారిపై దాడి చేయడం అమానుషమని రాష్ట్ర అటవీ శాఖ జూనియర్ ఆఫీసర్ల అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి కేవీ సుబ్బయ్య పేర్కొన్నారు. మంగళవారం రాత్రి శ్రీశైలం చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న డీఆర్వో, ఇద్దరు బీట్ అధికారులు, సిబ్బందిపై ఎమ్మెల్యే దౌర్జన్యానికి పాల్పడం దారుణమన్నారు. అతిథి గృహంలో బంధించి చిత్రహింసలు పెట్టారన్నారు. గాయపడినవారంతా ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందినవారేనన్నారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అటవీ శాఖమంత్రి పవన్ కళ్యాణ్‌లు తక్షణమే స్పందించాలన్నారు. ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు.

అనుమానాస్పద మృతి కేసు హత్య కేసుగా మార్పు