
24 నుంచి ఒంటిమిట్టలో పవిత్రోత్సవాలు
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు జరుగుతాయని టీడీడీ అధికారులు బుధవారం తెలిపారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఆగస్టు 23వ తేది సాయంత్రం ఆరు గంటలకు అంకుకార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఆల య పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాది మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ అని తెలిపారు. ఇందులో భాగంగా ఆగస్టు 24న ఉదయం చతుష్టానార్చన, పవిత్ర ప్రతిష్ట, సాయంత్రం పవిత్రహోమం, నివేదన, శాత్తుమొర జరగుతాయన్నారు. 25న ఉదయం పవిత్ర సమర్పణ, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. 26న ఉదయం మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన, కుంభప్రోక్ష, సాయంత్రం శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవర్ల ఊరేగింపు జరుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.
రాజంపేట టౌన్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పారిశ్రామిక శిక్షణా సంస్థ జిల్లా కన్వీనర్ సి.రామ్మూర్తి బుధవారం తెలిపారు. టెన్త్ ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 26వ తేదీలోపు iti.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనంతరం తమకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఐటీఐలో సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకోవాలని తెలిపారు. వెరిఫికేషన్ చేయించుకున్న వారి పేర్లు మాత్రమే మెరిట్ జాబితాలోకి వస్తాయని తెలిపారు. అర్హులైన అభ్యర్థులకు ఈనెల 29వ తేదీ ప్రభుత్వ ఐటిఐలలో, 30వ తేదీ ప్రైవేట్ ఐటీఐలలో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు.