
నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి
రాయచోటి: రెవెన్యూ అధికారులు నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన విజ్ఞప్తులు, భూముల రీసర్వే, భూమి రికార్డుల శుద్ధి, రికార్డుల అప్‌డేషన్ తదితర అంశాలపై బుధవారం రాయచోటిలోని పంక్షన్ హాల్‌లో రెవెన్యూ అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిబంధనల మేరకు సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వీఆర్‌ఓలు, తహసీల్దార్లు, ఆర్డీఓలను ఆదేశించారు. రెవెన్యూకు సంబంధించిన పనుల్లో కొంత గ్యాప్ కనిపిస్తోందన్నారు. సరియైన పరిజ్ఞానం లేకపోవడం, తెలుసుకోవాలన్న జిజ్ఞాస లోపించడం వల్ల ఆలస్యాలు జరుగుతున్నాయని కలెక్టర్ అన్నారు. జిల్లాలో రీసర్వే జాయింట్ ఎల్పీఎంల సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. దీంతో 965 కుటుంబాలు రెవెన్యూ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారన్నారు. కోర్టు వివాదాలు, పెండింగ్‌లో ఉన్న సివిల్ కేసులు మినహా ఇతర భూ వివాదాల పరిష్కారంలో అర్జీదారులను పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా నిబంధనల ప్రకారం పనులు చేయాలనిఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్