
కలిసి కట్టుగా దోమలను నివారిద్దాం
రాయచోటి జగదాంబసెంటర్: అందరూ కలిసి కట్టుగా దోమలను నివారించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ లక్ష్మీనరసయ్య పేర్కొన్నారు.ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా బుధవారం రాయచోటిలోని శివ నర్సింగ్ కాలేజీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో దోమల నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ దోమలు కుట్టడం ద్వారా మలేరియా వ్యాధి వ్యాపిస్తుందన్నారు. ఆడ అనాఫిలస్ దోమలు మలేరియా పరాన్నజీవిని మోసుకుపోతాయని, ఇవి కుట్టినప్పుడు పరాన్నజీవి మనుషుల రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తుందన్నారు. దోమల నుంచి రక్షణ పొందేందుకు దోమ తెరలను వాడాలని సూచించారు. సర్ రోనాల్డ్‌రాస్ అనే శాస్త్రవేత్త 1902 ఆగస్టు 20న దోమలో మలేరియా పరాన్నజీవిని కనిపెట్టిన రోజు అని చెప్పారు. ఆ మహనీయునికి నివాళులు అఅర్పిస్తున్నామని తెలిపారు.జిల్లా మలేరియా అధికారి రామచంద్రారెడ్డి, శివ నర్సింగ్ కళాశాల డైరెక్టర్ భాస్కర్, డిప్యూటీ హెల్డ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ మహమ్మద్‌రఫీ, బలరామరాజు, సబ్ యూనిట్ అధికారి జయరాం, ఎంపీహెచ్‌ఈఓ శ్రీనివాసులునాయక్, ఎల్‌టీ శివ పాల్గొన్నారు.
సిద్దవటం (ఒంటిమిట్ట): సిద్దవటం 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను బుధవారం ఆర్‌బీఎస్‌కె జిల్లా ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ రమేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలల్లో లింగనిర్ధారణ పరీక్షలు చేయకూడదని వైద్య సిబ్బందికి సూచించారు. గర్భిణులకు స్కానింగ్ తీసిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలు ఇవ్వాలే తప్ప పుట్టబోయే బిడ్డ వివరాలు తెలియజేయరాదన్నారు. కార్యక్రమంలో డాక్టర్ నగేష్, డాక్టర్ ప్రకాష్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.