
దర్జాగా ప్రభుత్వ భూమి కబ్జా
అట్లూరు : బద్వేలు నియోజకవర్గంలో ప్రభుత్వ భూమి ఎక్కడ కనిపిస్తే అక్కడ కూటమి నాయకులు, కార్యకర్తలు వాలిపోతున్నారు. మండల పరిధిలోని ఎస్.వెంకటాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 60, 61 లలో సుమారు పది ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అయితే టీడీపీకి చెందిన ఓ కార్యకర్త గత రెండు రోజులుగా యంత్రాలతో చదును చేస్తున్నాడు. రెవెన్యూ అధికారులకు తెలిసినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో ఈ భూమిలో ఇది ప్రభుత్వ భూమి, ఎవరైనా ఆక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినప్పటికీ అధికారం మాదే కదా హెచ్చరిక బోర్డులు ఏమవుతాయని అతిక్రమించి చదును చేయడం మండల ప్రజలను విస్మయానికి గురిచేసింది. గతంలో ఈ భూమి ప్రజా ప్రయోజనాల అవసరాల కోసమని కేటాయించామని, అయితే వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వ్యక్తి ఈ విలువైన భూమిని ఆక్రమించడం ఏమిటని స్థానిక టీడీపీ నాయకులే ఆరోపిస్తున్నారు.
తహసీల్దార్‌కు ఫిర్యాదు..
టీడీపీ కార్యకర్త సర్వే నంబర్ 60, 61 లలో సుమారు పది ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారని బుధవారం స్థానిక తహసీల్దారుకు ఎస్.వెంకటాపురం కాలనీకి చెందిన యేసన్న, ఈశ్వరయ్య ఆధ్వర్యంలో కాలనీ వాసులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూమిని కాపాడి కాలనీ వాసుల ప్రయోజనాలకు ఉంచాలని కోరారు.
తహసీల్దార్ వివరణ..
ఈ విషయమై తహసీల్దార్ సుబ్బలక్షుమ్మను వివరణ కోరగా విషయం తెలిసిన వెంటనే అక్కడికి సిబ్బందిని పంపించి పనులు నిలుపుదల చేయించామన్నారు. సంబంధిత వ్యక్తి తనకు ఆ భూమిపై హక్కు పత్రాలు ఉన్నాయని వివరణ ఇచ్చారని, సంబంధిత పత్రాలను పరిశీలించిన తర్వాత ఆర్డీఓకు నివేదిక పంపుతామన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చేంత వరకు ఆ భూమిలో ఎలాంటి ఆక్రమణలు జరగకుండా చర్యలు చేపడతామని తెలిపారు.

దర్జాగా ప్రభుత్వ భూమి కబ్జా