
దివ్యాంగుల పింఛన్ల తొలగింపుపై నిరాహార దీక్ష చేపడతా
ప్రొద్దుటూరు : రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పింఛన్ల తొలగింపుపై తాను నిరాహార దీక్ష చేపడతానని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి దివ్యాంగుల ఉసురు తప్పక తగులుతుందన్నారు. ఆయన పింఛన్లను తొలగించిన దివ్యాంగులతో కలసి బుధవారం సాయంత్రం తన స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాచమల్లు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 66.39 లక్షల పింఛన్లు ఉండగా, ఇప్పుడు 62.19 లక్షల పింఛన్లు మాత్రమే ఉన్నాయని, 4.19 లక్షల పింఛన్లను ప్రభుత్వం తొలగించిందన్నారు. గత 14 నెలల్లో ప్రభుత్వం ఒక్కరికీ కొత్త పింఛన్ మంజూరు చేయలేదని పేర్కొన్నారు. అలాగే గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కొత్త పింఛన్లను ఇస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు చేయకపోవడాన్ని బట్టి పేదలపై ఆయనకు ఏ మాత్రం ప్రేమ ఉందో అర్థమవుతోందన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి 581 మందికి పింఛన్లను తొలగిస్తూ అధికారులు నోటీసులు ఇచ్చారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులను టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతుందని అనుకున్నామే కానీ ఓటేసిన సాధారణ పేదలను కూడా ఇబ్బంది పెడుతోందన్నారు.
ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం
జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో మంచం మీద నుంచి లేవలేని వారికి రూ.10వేలు, పెరాలసిస్ వ్యాధి గ్రస్తులకు రూ.5వేలు పింఛన్ ఇస్తుండగా, చంద్రబాబు మంచం మీద ఉన్న వారికి రూ.15వేలు, పెరాలసిస్ వ్యాఽధి గ్రస్తులకు రూ.10వేలు చొప్పున పెంచుతున్నట్లు ఆర్భాటంగా ప్రకటించారని రాచమల్లు తెలిపారు. ఇప్పడు ఈ విధంగా వికలత్వం శాతం తక్కువగా ఉందని అసలుకే ఎసరు పెట్టారన్నారు.