
ఉత్తమ ప్రతిభా అధికారులకు ప్రశంసా పత్రాలు
రాయచోటి : అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్, జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్‌రాజేంద్రన్, డీఆర్‌ఓ మధుసూదన్‌రావు, ఆర్డీఓ శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సదర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలలో ఉత్తమ ప్రతిభను కనపరిచిన జిల్లా అధికారులు, సిబ్బందికి మంత్రి ప్రశంసాపత్రాలు అందజేశారు.
స్వాతంత్య్ర సమరయోధులకు ఘన సత్కారం
79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో భాగంగా శుక్రవారం ఉదయం రాయచోటి పోలీస్ పేరెడ్ గ్రౌండ్‌లో స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చేతులు మీదుగా ఘనంగా సత్కరించారు. జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్, ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్‌లతో కలిసి స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు సన్మానం చేశారు. రైల్వేకోడూరుకు చెందిన కీ.శేలు రామలింగరాజు కుమారుడు రాధాకృష్ణ రాజు, టి సుండుపల్లికి చెందిన దివంగత ఎర్రపురెడ్డి ఆదినారాయణ రెడ్డి కుమారుడు ఎర్రపు రెడ్డి, శివకుమార్ రెడ్డిలు సన్మానం పొందిన వారిలో ఉన్నారు.
16వ సారి వ్యాఖ్యతగా పోలీస్ వెంకట యాదవ్
దేశ స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవ వేడుకలలో 16వ సారి వ్యాఖ్యతగా పోలీస్ వెంకట యాదవ్ అరుదైన రికార్డును సాధించారు. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో వ్యాఖ్యతగా వ్యవహరించారు. ఆయన వాగ్దాటితో సమరయోధుల జాతీయతను, పోరాటాన్ని, దేశం గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, శాఖల పనితీరు, ప్రభుత్వ పథకాలను తన మాటలతో, స్వరంతో జిల్లా అధికారులను, విద్యార్థులను, వీక్షకులను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం యాదవ్ జిల్లా ఎస్పీ పీఆర్‌ఓగా పనిచేస్తున్నారు.
పోలీసుల సేవలు ప్రశంసనీయం
దేశ రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అభిప్రాయపడ్డారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా రిజర్వ్ పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జిల్లా ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశం సాధించిన ప్రగతిలో పోలీసుల పాత్ర ఎంతో గొప్పదని ఆయన పేర్కొన్నారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అదనపు ఎస్పీ ఎం వెంకటాద్రి జాతీయ జెండాను ఎగురవేశారు.