
చనిపోయిన వాళ్లు ఉపాధి హామీ పనులు చేశారు
గుర్రంకొండ : నాలుగేళ్ల క్రితం చనిపోయిన వాళ్లు ఉపాధిహామీ పనులు చేశారు. గోకులం షెడ్ల నిర్మాణంలో మంజూరైన బిల్లుల్లో అవకతవకలు జరిగాయి. ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఉపాధిహామీ కూలీలుగా పనిచేసి బిల్లులు చేసుకొన్నారు. ఇవన్నీ గుర్రంకొండ మండలంలో ఏడాదిగా జరిగిన ఉపాధి హామీ పనుల్లో జరిగిన వింతలు, విశేషాలు. దీనికి సంబంధించి ఒక టెక్నికల్ అసిస్టెంట్, ఒక ఫీల్డ్ అసిస్టెంట్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఉపాధిహామీ అక్రమాల్లో మొత్తం రూ. 2,39,372 అవినీతి జరిగినటు అఽఽధికారులు లెక్కలు తేల్చి ఎనిమిది పనులపై విచారణకు ఆదేశించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
గుర్రంకొండలోని ఉపాధిహామీ కార్యాలయంలో బుధవారం పీడీ వెంకటరత్నం ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ బహిరంగ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 2024–25 ఏడాదికి సంబంధించి మొత్తం రూ.5.50 కోట్లు ఉపాధి హామీ పనులు జరిగాయన్నారు. ఇందులో కూలీలకు వేతనాల కింద రూ.4.30 కోట్లు, మెటీరియల్ చెల్లింపుల కింద రూ. 1.20 చెల్లించామన్నారు. గ్రామాల వారీగా ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవినీతిని చదివి వినిపించారు.
● సరిమడుగులో 2021లో చనిపోయిన ఓ వ్యక్తి 2024లో పనిచేసినట్లు మస్టర్లలో చూపించి బిల్లు డ్రా చేసుకొన్నారు. ఇదే పంచాయతీలో చిన్న రమణ అనే వ్యక్తి 2023లో చనిపోగా ప్రస్తుతం అతను వారం రోజుల పాటు ఉపాధి హామీ పనులు చేసినట్లు రికార్డుల్లో చూపించి బిల్లులు డ్రా చేసుకొన్నారు.
● గుర్రంకొండ, సరిమడుగు గ్రామాల్లో అంగ్‌నవాడీ టీచర్లు, బెంగుళూరులో ఉద్యోగం చేసుకొనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఉపాధి హామీ పనులు చేసినట్లు చూపించి బిల్లులు డ్రా చేసుకొన్నట్లు విచారణలో తేలింది.
● శెట్టివారిపల్లె, టి.రాచపల్లె, సరిమడుగు గ్రామాల్లో ఒకరి పేరుమీద మంజూరైన షెడ్లు బినామీ వ్యక్తులు నిర్మించుకొని బిల్లులు చేసుకొన్నట్లు విచారణలో తేలింది.
● టి.రాచపల్లెలో గోకులం షెడ్లు బిల్లుల మంజూరు కోసం ఉపాదిహామీ సిబ్బంది రైతుల దగ్గర నుంచి రూ.20 వేలు లంచం వసూలు చేసినట్లు విచారణలో తేలినట్లు అధికారులు తెలిపారు.
● పదిగ్రామాల్లో బినామీ పేర్లతో మస్టర్లలో ఒకరే ఫోర్జరీ సంతకాలు చేసి లక్షలాది రూపాయల నిధు లు డ్రా చేసుకొన్నారు. ఇందులో ఫీల్డ్ అసిస్టెంట్లు, వారి కుటుంబ సభ్యులు పనులు చేయకపోయినా వారి పేర్లు మస్టర్లలో నమోదు చేసుకొని బిల్లులు డ్రా చేసుకొన్నట్లు అధికారులు ప్రకటించారు.
● రెండు గ్రామాల్లో ఫారంఫాండ్ పనులు చేయకపోయినా ఉపాధిహామీ సిబ్బంది బినామీ పేర్లతో మస్టర్లు వేసుకొని బిల్లులు డ్రా చేసుకొన్నారు.
● మస్టర్లలో కూలీల సంతకాలను కొంతమంది నాయకులు ఫోర్జరీ చేసి బిల్లులు డ్రా చేసుకొన్నారు.
● గుర్రంకొండ, టి.పసలవాండ్లపల్లె గ్రామాల్లో హౌసింగ్ బిల్లులను లబ్ధిదారుల పేరుమీద కాకుండా బినామీ వ్యక్తుల పేర్లతో బిల్లులు చేసుకొన్నారు.
● వీటికి సంబంధించి ఉపాధిహామీ సిబ్బందికి రూ. 7 వేలు జరిమానా విధించారు. కాగా ఉపాధిహామీ పనుల్లో జరిగిన అక్రమాల్లో రూ. 2,39,372 ఆవినీతి జరిగినట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి సరిమడుగు ఫీల్డ్ అసిస్టెంట్ పూజిత, టెక్నికల్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌రాజులను సస్పెండ్ చేసినట్లు పీడీ వెంకటరత్నం తెలిపారు. మండంలో వివాదాస్పదంగా మారిన ఎనిమిది పనులపై ఎంపీడీవో, ఏపీడీలతో విచారణ కమిటీ ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమంలో ఏపీడీ మధుబాబు, ఏఓ బ్రహ్మానందరెడ్డి, ఏపీవో జయరామిరెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు ఎంఎల్‌ఎన్ మూర్తిరావ్, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు మహాత్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గోకులం బిల్లుల్లో గోల్‌మాల్
ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కూలీలే
రూ.2,39,372 రికవరీకి ఆదేశం