
భర్త మద్యం మానలేదని బలవన్మరణం
నిమ్మనపల్లె : కులాలు వేరైనా పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంది.. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కొంత కాలానికి భర్త మద్యానికి బానిస కావడంతో, ఎలాగైనా మాన్పించాలనుకుంది.. అందుకోసం ఎన్నోసార్లు భర్తతో గొడవ పడింది.. భర్త అలవాటును మార్చలేక.. తన వాళ్ల ముందు తలెత్తుకోలేక.. తీవ్ర మనస్థాపానికి గురై ఆ అభాగ్యురాలు తనువు చాలించింది. ఈ సంఘటన మంగళవారం రాత్రి నిమ్మనపల్లె మండలంలో జరిగింది. పెద్దతిప్పసముద్రం మండలం టి.సదుం పంచాయతీ రామాపురం గ్రామానికి చెందిన మలిశెట్టిపల్లె వెంకటరమణ, వెంకట రమణమ్మ దంపతుల కుమార్తె ఎం.రత్నమ్మ ఎం.ఫార్మసీ వరకు చదివి, మదనపల్లె ఎన్టీఆర్ సర్కిల్‌లోని అపోలో మెడికల్ షాప్‌లో పనిచేస్తూ ఉండేది. నిమ్మనపల్లి మండలం కొండయ్యగారిపల్లి పంచాయతీ వెంకోజిగారిపల్లెకు చెందిన బల్లాపురం చంద్రశేఖర్ కుమారుడు జ్యోతి శేఖర్ తల్లిదండ్రులు మరణించడంతో అమ్మమ్మ ముని సుబ్బమ్మతో ఉంటూ డిగ్రీ వరకు చదువుకొని మదనపల్లె అపోలో ఫార్మసీలో చేరాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో కొన్నాళ్ల తర్వాత 2019 సంవత్సరంలో పెద్దలను కాదని ఇరువురు తవళం నేలమల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ముని పుష్కర్ నందన్ అనే ఒకటిన్నర ఏడాది బాబు ఉన్నాడు. వివాహం అనంతరం ఇరువురు ఉద్యోగాలు మానేసి, ఇంటివద్దే ఉంటూ జ్యోతి శేఖర్ పెయింటింగ్ పనులకు వెళ్తుండగా , రత్నమ్మ స్థానికంగా పనులకు వెళ్లేది. కొంతకాలంగా జ్యోతి శేఖర్ విపరీతంగా మద్యానికి బానిస అయ్యాడు. మద్యం సేవించి ఇంటికి వచ్చిన సమయంలో భార్యతో అతిగా గొడవపడేవాడు. ఈ క్రమంలో తరచు భార్యాభర్తల మధ్య మద్యం అలవాటు విషయమై విభేదాలు తలెత్తి గొడవపడేవారు. మూడు నెలలుగా రత్నమ్మ భర్తను నీవు మద్యం అలవాటు మానకపోతే నేను చచ్చిపోతాను అంటూ బెదిరించేది. ఈ నేపథ్యంలో మంగళవారం భర్త మద్యం సేవించి ఇంటికి రాగా ఇరువురి మధ్య గొడవ జరిగింది. అనంతరం జ్యోతి శేఖర్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి, రత్నమ్మ ఇంటికి గడియ పెట్టి ఉండడంతో, జ్యోతి శేఖర్ కిటికీలో నుంచి లోనికి చూడగా భార్య ఉరి వేసుకొని వేలాడుతూ ఉండటం గమనించాడు. వెంటనే తలుపులు బద్దలు కొట్టి స్థానికుల సాయంతో భార్యను కిందికి దించి, వెంటనే స్థానిక పీహెచ్‌సీ కేంద్రానికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్య సిబ్బంది రత్నమ్మ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. ఈ విషయం స్థానికులు పోలీసులకు తెలియజేయడంతో, వారు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బుధవారం ఉదయం తహసీల్దార్ తపస్విని స్థానికుల సమక్షంలో శవ పంచనామా నిర్వహించి వాంగ్మూలం రికార్డ్ చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి వెంకటరమణ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తిప్పేస్వామి తెలిపారు.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

భర్త మద్యం మానలేదని బలవన్మరణం