
బినామీ వ్యక్తులు గోకులం షెడ్లు నిర్మించుకోవచ్చా?
గుర్రంకొండ : అసలు లబ్ధిదారులు కాకుండా బినామీ వ్యక్తులు గోకులం షెడ్లు నిర్మించుకోవచ్చా, వీటిని మీరు సమర్థిస్తూ ప్రోత్సహిస్తున్నారా అంటూ మండలంలోని శెట్టివారిపల్లెకు చెందిన రైతులు ఉపాధిహామీ అధికారులను నిలదీశారు. ప్రభుత్వ స్థలా ల్లో గోకులం షెడ్లు నిర్మించుకోవడం తప్పు కాదా వీటిని మీరు సమర్థించడం ఎంతవరకు సబబని వారు ప్రశ్నించారు. బుధవారం స్థానిక ఉపాధిహామీ కార్యాలయంలో సామాజిక తనిఖీ బహిరంగ సభ నిర్వహించారు. మండలంలోని శెట్టివారిపల్లె, టి.రాచపల్లె గ్రామాల్లో గోకులం షెడ్ల నిర్మాణాల ప్రస్తావన రాగానే వాగ్వాదం చెలరేగింది. శెట్టివారిపల్లెలో ఒకరి పేరుమీద మంజూరైన గోకులం షెడ్లు మరొకరు నిర్మించుకొన్నారని రైతులు ఫిర్యాదు చేశారు. అందులో ప్రభుత్వ స్థలంలో వీటిని నిర్మించుకొన్నారని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని చోట్ల గోకులం షెడ్లను కోళ్లఫారాలుగా మార్చేశారని వారు పేర్కొన్నారు. టి.రాచపల్లెలో గోకులం బిల్లుల మంజూరులో ఉపాధిహామీ సిబ్బంది లంచాలు వసూలు చేశారని రైతు ఫిర్యాదు చేశారు. బినామీ పేర్లతో నిర్మించుకొంటే తప్పేలేదని, సమస్య ఉంటే వారే చూసుకొంటారనే ధరోణిలో జిలా ఉన్నతాధికారులు తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన రైతులు మీరే తప్పులను ప్రోత్సహించడం దారుణమన్నారు. ఇలాగైతే మాకూ ఓ నాలుగు గోకులం షెడ్లు మంజూరు చేయండి మేము బినామీ పేర్లతో కట్టుకొంటామని రైతులు అధికారులను కోరారు. షెడ్లు నిర్మాణాల సమయంలోనే తాము ఎన్నోమార్లు స్థానిక ఉపాధిహామీ అధికారులకు, సిబ్బందికి ఫిర్యాదు చేశామని అయినా వారు పట్టించుకోకుండా బినామీ వ్యక్తులకు బిల్లులు చేయడం ఎంతవరకు సబబని అధికారులను నిలదీశారు. పోరంబోకు స్థలంలో గోకులం షెడ్లు నిర్మిస్తున్నారని ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదన్నారు. కనీసం గోకులం షెడ్లు నిర్మించే స్థలాలకు సంబంధించిన ఒన్‌బీ అడంగల్ కాపీలను కూడా చూడకుండా ఉపాధిహామీ సిబ్బంది ఎలా బిల్లులు చేస్తారని రైతులు నిలదీశారు. వీటిపై రెవెన్యూ అధికారులు, ఎంపీడీఓతో ఒక కమిటీ వేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని విచారణలో వాస్తవాలు తేలితే తదుపరి చర్యలు తీసుకొంటామని పీడీ సమాధానమిచ్చారు.
వీటిని మీరు ప్రోత్సహిస్తున్నారా?
ప్రభుత్వ స్థలాల్లో గోకులం కట్టుకున్నా తప్పుకాదా?
అధికారులను నిలదీసిన రైతులు