
మత్తుకు బానిసలైతే భవిష్యత్తు నాశనమే
రాయచోటి టౌన్ : మత్తుకు బానిసైతే మీ భవిష్యత్తు నాశనమవుతుందని పోలీసు అధికారులు విద్యార్థులకు సూచించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు బుధవారం రాయచోటి డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో నషా ముక్త్ భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో కలసి మత్తుకు బానిసలం కాము అనే నినాదంతో ప్రతి/్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి తరం యువత మత్తుకు బానిసగా మారి హత్యలు, నేరాలకు పాల్పడుతూ తమ భవిష్యత్తును నాశనం చేసుకొంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయా ప్రాంతాలకు చెందిన పోలీసు అధికారులు పాల్గొన్నారు.
లారీలు ఢీకొని
ఇద్దరు డ్రైవర్లకు గాయాలు
మదనపల్లె రూరల్ : రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు డ్రైవర్లు తీవ్రంగా గాయపడిన ఘటన బుధవారం మదనపల్లె మండలంలో జరిగింది. కుప్పం వడ్డిపల్లెకు చెందిన డ్రైవర్ నారాయణస్వామి(30) టెంపోలో మదనపల్లె టమాటా మార్కెట్‌కు బయలుదేరాడు. హైదరాబాదుకు చెందిన వెంకటదుర్గారావు(45) లారీలో పలమనేరుకు బయలుదేరాడు. మార్గమధ్యంలోని 150వ మైలువద్ద రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో లారీల్లోని ఇద్దరు డ్రైవర్లు గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను 108 అంబులెన్స్‌లో మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు.
గర్భిణి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : గర్భిణి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన బుధవారం పీటీయం మండలంలో జరిగింది. బాధితురాలి కథనం మేరకు.. పీటీఎం మండలం టి.సదుంకు చెందిన శ్రీకాంత్ భార్య పావని(27) ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. వీరికి ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా భర్త కొంతకాలంగా తనను, బిడ్డను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన స్థానికులు బాధితురాలిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పీటీయం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మత్తుకు బానిసలైతే భవిష్యత్తు నాశనమే