వర్షానికి కూలిన మిద్దె
పెద్దతిప్పసముద్రం : మండలంలోని తుమ్మరకుంట పంచాయతీ గజ్జెలవారిపల్లికి చెందిన శంకర్‌రెడ్డి అనే వ్యక్తికి చెందిన మిద్దె వర్షం కారణంగా కూలిపోయింది. ఇంటి పైకప్పునకు వేసిన బలమైన రాతి కప్పులు ఒక్కసారిగా కూలిపోయాయి. రాతి కప్పులు పగలడంతో ఇంట్లో ఉన్న ధాన్యం, వంట పాత్రలు, టీవీ ధ్వంసం అయ్యాయి. అంతేగాక ఈ ఘటనలో శంకర్‌రెడ్డి భార్య నేత్రావతికి నడుం భాగం, కుమారుడు ఆదర్శ (23)కు కుడి కాలు దెబ్బతింది. ఇంటి పైకప్పు పూర్తిగా కూలిపోవడంతో రూ.4లక్షల నష్టం వాటిల్లడమే గాక తాము అద్దె ఇంట్లో తల దాచుకుంటున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.
మార్కెట్ యార్డులో వ్యక్తి ఆత్మహత్య
మదనపల్లె రూరల్ : మదనపల్లె మార్కెట్ యార్డులో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం వెలుగు చూసింది. స్థానిక మార్కెట్ యార్డులో సురేంద్ర(45) అనే వ్యక్తి కూలి పనులు చేసుకుంటూ ఉండేవాడు. భిక్షాటన కూడా చేసేవాడు. కూలి డబ్బులతో అన్నా క్యాంటీన్‌లో భోజనం చేస్తూ, మార్కెట్ యార్డ్ పరిసరాల్లోనే ఉండేవాడు. సోమవారం ఉదయం మార్కెట్ యార్డ్ పక్కనే ఉన్న పోలీస్ అవుట్ పోస్ట్ వెనుక వైపున గదిలో అతను ఉరి వేసుకుని ఉండటాన్ని స్థానికులు గమనించి టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి మృతి
సుండుపల్లె : రోడ్డు ప్రమాదంలో షేక్ మహమ్మద్(26) అనే యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. రాయవరం గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ తన అత్త తహషీన్ కుమారుడు అయిన షేక్ మహమ్మద్‌ను ఎంసెట్ పరీక్షకు ద్విచక్రవాహనంలో రాజంపేటకు తీసుకుని వెళ్లాడు. పరీక్ష అనంతరం తిరిగి సుండుపల్లెకు వస్తుండగా మార్గమధ్యంలో సానిపాయి–సుండుపల్లె ప్రధాన రహదారిలో కృష్ణారెడ్డిచెరువు సమీపంలో ఎదురుగా వస్తున్న లగేజీ టెంపో, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్రవాహనం నడుపుతున్న షేక్ మహమ్మద్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుకవైపు కూర్చున్న యువకుడికి రక్త గాయాలయ్యాయి. మృతుని అన్న షరీఫ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ముత్యాల శ్రీనివాసులు తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
బి.కొత్తకోట : మండలంలోని బయ్యప్పగారిపల్లె పంచాయతీ గట్టమీద దళితవాడకు చెందిన వరాలయ్య (60) సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సమస్యలతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించడంతో కుటుంబీకులు గుర్తించి మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.
వర్షానికి కూలిన మిద్దె
వర్షానికి కూలిన మిద్దె


