పేరుకే లైనింగ్ పనులు
జిల్లాలోని పెద్దతిప్పసముద్రం, బి.కొత్తకోట, కురబలకోట, మదనపల్లె రూరల్, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు రూరల్, పెద్దపంజాణి మండలాల్లో హంద్రీ–నీవా ప్రాజెక్టు పుంగనూరు ఉపకాలువ 224.5 కిలోమీటర్ల దూరం సాగుతుంది. ఈ కాలువను రూ.1,217 కోట్లతో వెడల్పు పనులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్‌తో ఒప్పందం కూడా చేసుకుంది. ఈ పనులు కూడా మొదలైనా కూటమి ప్రభుత్వం రాగానే రద్దు చేసి..ఇవే నిధులు మిగిలాయంటూ రూ.480.22 కోట్లతో ఎన్‌సీసీ సంస్థకు టెండర్ లేకుండా నామినేషన్‌పై కట్టబెట్టేసింది. ఈ పనులను మేనెలలోగా పూర్తి చేస్తామని ప్రభుత్వం, అధికారులు ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. అయితే ఇంతవరకు జరిగిన పనులు నత్తనే తలపిస్తున్నాయి. కాంట్రాక్టు సంస్థ కాలువకు ఇరువైపులా లైనింగ్ పనులు చేపట్టి మేనెలలో పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు జరుగుతున్న పనులు నామమాత్రమే. అన్నమయ్య జిల్లా పరిధిలో 13 కిలోమీటర్లు, చిత్తూరుజిల్లా పరిధిలో రెండు కిలోమీటర్ల వరకే లైనింగ్ పనులు జరిగినట్టు అధికారుల లెక్క. ఈ పనులపై సాంకేతిక అధికారులు, క్వాలీటి కంట్రోల్ విభాగం దృష్టి పెట్టలేదని తెలుస్తోంది. ఈ పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా పనులు పూర్తయ్యే అవకాశాలు కనుచూపు మేర కనిపించడం లేదు.


