
373 మంది గైర్హాజరు
రాయచోటి: జిల్లాలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. బుధవారం జరిగిన పరీక్షలకు 373 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం మొదటి సంవత్సరం, మధ్యాహ్నం రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలను నిర్వహించారు. జిల్లాలో మొదటి సంవత్సరానికి 6158 మంది విద్యార్థులకు గాను 5861 మంది హాజరు కాగా 297 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 1779 మంది విద్యార్థులకు గాను 1703 మంది హాజరు కాగా 76 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేదు. స్క్వాడ్ బృందాలు, జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి ఆర్ కృష్ణయ్య పరీక్షా కేంద్రాలను సందర్శించారు.
నేడు జిల్లాలో
బీసీజీ వ్యాక్సినేషన్
రాయచోటి: జిల్లాలో బీసీజీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టి, టీబీ నివారణే లక్ష్యంగా జిల్లాలోని అన్ని సచివాలయాలలో ప్రతి గురువారం బీసీజీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కొండయ్య, అదనపు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ శైలజ పేర్కొన్నారు. బీసీజీ టీకాను 9 నెలల్లోపు పిల్లలకు ఒక డోసు వేయడం జరుగుతోందన్నారు. జిల్లాలో 2025 నాటికి టీబీ నివారణే లక్ష్యంగా జిల్లాలో గత రెండు వారాలలో 21,404 వ్యాక్సినేషన్లను వేశామన్నారు. జిల్లాలో 4737 42 వ్యాక్సిన్లు వేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈనెల 30న అన్ని సచివాలయాలలో బీసీజీ వ్యాక్సిన్‌లను అందిస్తున్నట్లు వారు తెలిపారు.
దరఖాస్తుల ఆహ్వానం
కడప ఎడ్యుకేషన్: కడప రామాంజనేయపురంలోని ఆంధ్రప్రదేశ్ మైనారిటీ గురుకుల పాఠశాలలో 5,6 తరగతుల్లో మిగిలిన సీట్ల ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పెతకంశెట్టి సోమ సత్యశేఖర్ తెలిపారు. ముస్లిం మైనారిటీ, దూదేకుల విద్యార్థులు నేరుగా పాఠశాలకు వచ్చి దరఖాస్తు ఇవ్వాలని చెప్పారు.వివరాలకు 7780179446, 9059500173 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
ఏసీఏ జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ నియామకం
కడప స్పోర్ట్స్: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2024–25 సీజన్‌కు సంబంధించి జూనియర్ క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా వైఎస్సార్ జిల్లాకు చెందిన పైడికాల్వ విజయ్‌కుమార్‌ను నియమించారు. నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపీనాథ్‌రెడ్డి జారీచేశారు. ఈ నియామకం ఏడాది పాటు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా పైడికాల్వ విజయ్‌కుమార్ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పరిధిలో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యథిక వికెట్లు తీసిన ఆంధ్రా బౌలర్‌గా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.
ప్రశాంతంగా
పాలిసెట్ కౌన్సెలింగ్
కడప ఎడ్యుకేషన్: కడప నగర శివార్లలోని మహిళా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం నిర్వహించిన పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఇందులో భాగంగా 27001 నుంచి 43 వేల మధ్య ర్యాంకులు వచ్చిన 137 మంది విద్యార్థులు హాజరై తమ సర్టిఫికెట్లను పరిశీలన చేయించుకున్నారని పాలిసెట్ జిల్లా కో–ఆర్డినేటర్, ప్రిన్సిపాల్ సీహెచ్ జ్యోతి తెలిపారు. కౌన్సెలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. గురువారం 43001 నుంచి 59000 వరకు ర్యాంకు లు పొందిన విద్యార్థుల సర్టిఫికెట్లు, ర్యాంకుల పరిశీలన ఉంటుందని జ్యోతి తెలిపారు.