మదనపల్లె సిటీ: యువతలో నైపుణ్యాన్ని పెంపొందించి పరిశ్రమలకు అందిస్తున్నాయి ఐటీఐలు. కావాల్సినంత భరోసానిస్తూ బంగారు భవితకు బాటలు పరుస్తున్నాయి. ఐటీఐలలో చేరిన విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అవసరమైన మెలకువలపై పట్టు సాధిస్తుండటంతో కోర్సు పూర్తవగానే మెండుగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. స్పల్పకాలిక వ్యవధిలోనే జీవితాల్లో స్థిరపడుతూ కుటుంబాలకు దన్నుగా నిలుస్తున్నారు.
ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు:
జిల్లాలో పలు ఐటీఐలు సంప్రదాయ కోర్సులతో పాటు ఒక్కో కోర్సుకు ప్రాధాన్యమిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నాయి. జిల్లా ప్రభుత్వ ఐటీఐలో టర్న ర్, మెషనిస్టు, ఫిట్టర్, ఎలక్ట్రికల్, మెకానికల్ కోర్సు లు చేసిన పలువురు విద్యార్థులు ప్రముఖ సంస్థలైన బీహెచ్‌ఈఎల్, అమరరాజా, బీఈఎల్, ఐఓసీఎల్ వంటి ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు పొందారు.
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు:
ఐటీఐ పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు అప్రెంటీస్ పూర్తి చేసుకుంటే 18 ఏళ్లు దాటగానే పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు పొందడానికి ఐటీఐ ఒక చక్కటి మార్గంగా ఉంటుంది. విద్యుత్, రైల్వే, రక్షణ, పలు ప్రభుత్వ, ప్రముఖ ప్రైవేటు సంస్థల్లో ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులకు స్కిల్ తప్పనిసరిగా ఉండాలి. ఆయా ట్రేడుల్లో నైపుణ్యం సంపాదించిన విద్యార్థులకు ఉపాధి తప్పనిసరిగా లభిస్తుంది. ఇదిలా ఉంటే రాష్ట్ర నైపుణ్యాభివృద్ది శిక్షణ సంస్థ, ఐటీఐల్లో స్కిల్ హబ్‌లు ఏర్పాటు చేసి విద్యార్థులకు నైపుణ్య అంశాలపై శిక్షణ కూడా ఇస్తోంది. ఉద్యోగం, ఉపాధితో పాటు స్వయం ఉపాధి సైతం ఐటీఐ కోర్సు ఎంతో దోహదం చేస్తుంది.
కోర్సుల వివరాలు ఇలా..
ప్రభుత్వ,ప్రైవేటు ఐటీఐలలో ఏడాది, రెండు సంవత్సరాలకు సంబంధించిన పలు కోర్సులు ఉన్నాయి. ఇందులో రెండు సంవత్సరాలకు సంబంధించి ఎలక్ట్రికల్, ఫిట్టర్, మోటార్ మెకానిక్, డ్రాప్ట్‌మెన్ సివిల్, టర్నర్, మిషనిస్టు కోర్సులు ఉన్నాయి. ఏడాదికి సంబంధించి కంప్యూటర్ కోర్సు(కోప), డీజిల్ మెకానిక్, వెల్డర్, కార్పెంటర్ కోర్సులు ఉన్నాయి.
ఉన్నత చదువులకు అవకాశం
ఐటీఐలో రెండేళ్ల వ్యవధి ఉన్న కోర్సులు పూర్తి చేసిన వారికి ఉన్నత చదువులకు అవకాశం ఉంది. ఐటీఐ పూర్తి చేసిన వారికి పాలిటిక్నిక్ రెండో సంవత్సరంలో బ్రిడ్జి కోర్సు ద్వారా ప్రవేశం పొందేందుకు అవకాశం ఉంది. పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారు బీటెక్‌లో ప్రవేశం పొందవచ్చు. ఈ విధంగా ఏటా పలువురు లేటర్ ఎంట్రీని పొంది ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు.