
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కొత్తగా అన్నమయ్య జిల్లా ఆవిర్భవించిన తర్వాత జరుగుతున్న తొలి సార్వత్రిక ఎన్నికలు ఇవి. సిట్టింగ్ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి ముచ్చటగా మూడోసారి వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర విభజనకు కారకుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి బీజేపీ అభ్యర్థిగా ఈయనపై పోటీలో ఉన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి పీవీ మిథున్‌రెడ్డి చేసిన అభివృద్ధి, ఆయన విజయావకాశాలు తదితర అంశాలపై ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు.. – రాజంపేట
? : మీరు రాజంపేట స్థానం నుంచి ఎన్నోసారి పోటీ చేస్తున్నారు. మీ బలం ఏమిటి?
● మిధున్‌రెడ్డి : రాజంపేట నుంచి మూడోసారి పోటీ చేస్తున్నాను. ప్రజలతో పాటు పార్టీ క్యాడర్‌కు అండగా ఉంటా. పిలిస్తే పలుకుతా..చెబితే చేస్తాను. రెండుసార్లు రాజంపేట లోక్‌సభ ప్రజలు ఆశీర్వదించారు. మూడోసారి ఆశీర్వదిస్తే లోక్‌సభ నియోజకవర్గం అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషిచేస్తాను. ప్రజల అండదండలతో ఈ ఎన్నికల్లో ముందుకెళుతున్నాను.
? : మీ ప్రత్యర్థి, మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి, మీకు ఉన్న తేడా ఏమిటి
● నేను లోకల్ లీడర్, కిరణ్‌కుమార్‌రెడ్డి గెస్ట్ పొలిటిషియన్. వస్తాడు. పనిచేసుకుంటాడు. హైదరాబాదుకు వెళ్లిపోతాడు. ఇది లోక్‌సభ పరిధిలోని ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు మళ్లీ సూట్‌కేసుతో హైదరాబాదుకు పంపించేందుకు జనం సిద్ధంగా ఉన్నారు.
? : మీకున్న బలం ఏమిటి? ఏ విధంగా
ఈ ఎన్నికల్లో గెలుస్తారని భావిస్తున్నారు
● నాకున్న బలం ప్రజలు. జగనన్న ఆశయాలతో ముందుకెళుతున్నాను. ఈ ఎన్నికల్లో ఓటర్లు సంక్షేమం, అభివృద్ధినే చూస్తారు. మళ్లీ ఫ్యాన్ ప్రభంజనమే. జగనన్న ఎన్నికల సభలకు జ నం బ్రహ్మరథం పట్టారు. అందుకే కూటమిలో ఓటమి గుబులు పట్టుకుంది.
? : రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఏ విధంగా అభివృద్ధి చేశారు.
వచ్చే టర్మ్‌లో ఏం చేయనున్నారు
● రూ.2400 కోట్లతో వాటర్‌గ్రిడ్స్ పూర్తి చేశాము. హంద్రీనీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులను ముందుకు నడిపిస్తున్నాము. కడప–రేణిగుంట జాతీయ రహదారి నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చాను. రాయచోటి, పుంగనూరు, రైల్వేకోడూరు, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె, రాజంపేట ప్రాంతాల్లో అభివృద్ధిని పరుగులు తీయించాము. అన్ని నియోజకవర్గాలలో ఆ ప్రాంత పరిస్ధితులను బట్టి అభివృద్ధి చేస్తున్నాం. రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ పార్లమెంటరీ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నదే నా సంకల్పం. తప్పకుండా దేవుడు, ప్రజల ఆశీస్సులతో నా సంకల్పం సిద్ధిస్తుందని ఆశిస్తున్నాను.
? : రాజంపేట లోక్‌సభ
నియోజకవర్గం పరిధిలో
రైల్వే సమస్యల పరిష్కారానికి
ఏ విధంగా కృషి చేశారు
● ప్రధానంగా రైల్వేపరంగా ప్రసిద్ధి చెందిన నందలూరు రైల్వేకేంద్రంలో నూతన రన్నింగ్‌రూం మంజూరుకు కృషి చేశాను. బడ్జెట్‌లో కూడా ప్రకటించారు. రైల్వే పూర్వవైభవం కోసం ప్రత్యామ్నాయ పరిశ్రమ ఏర్పాటు చేయాలని లోక్‌సభలో కూడా ప్రస్తావించాను. ఎప్పటికప్పుడు నందలూరు రైల్వే అభివృద్ధి కోసం రైల్వేమంత్రి, రైల్వేబోర్డుకు వినతులు ఇస్తూనే ఉన్నాము. ఎన్నడూ లేని విధంగా ముంబై–రేణిగుంట రైలుమార్గంలోని రాజంపేట లోక్‌సభ పరిధిలో ఉన్న రైల్వే ప్రాంతాల్లో గేట్ల సమస్య లేకుండా ఆర్‌యూబీ(రోడ్ అండర్ బ్రిడ్జి)ల మంజూరుకు కృషి చేశాము. ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. రాజంపేట, పీలేరు రైల్వేస్టేషన్లను అమృత్‌లో ఎంపికకు కృషి చేశాను. అలాగే కరోనా ముందు ఏ విధంగా హాల్టింగ్ సౌకర్యం ఉండేదో అదే విధంగా ఉండేలా రైల్వే మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లాను.
? : జిల్లాకు సంబంధించిన అంశంపై చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు సాధ్యమయ్యేవేనా
● చంద్రబాబు రాజంపేటకు వస్తే ఒక మాట..రాయచోటికి వెళితే మరొక మాట, మదనపల్లెలో ఉంటే ఇంకో మాట ఇలా జనం చెవిలో పువ్వులు పెడతారు. అవి సాధ్యం కావని ప్రజలకు తెలుసు. బాబు మాటలను నమ్మే పరిస్థితిలో రాజంపేట జనం లేరు. ఊసరవెల్లి రాజకీయాలకు రాజంపేట ప్రజలు చెల్లుచీటి పలుకుతారు. మేము వచ్చే టర్మ్‌లో అన్నమయ్య ప్రాజెక్టును పూర్తి చేయిస్తాము. 18వ మెడికల్ కాలేజి రాజంపేటలో ఏర్పాటు చేస్తామని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు.
? : రాజంపేట వైఎస్సార్‌సీపీ లోక్‌సభ అభ్యర్ధిగా విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి
● కచ్చితంగా జగనన్న సంక్షేమం, అభివృద్ధి నన్ను గెలిపిస్తాయి. దళితులు, ముస్లింలు, క్రైస్తవులు, బీసీల ఆశీర్వాదాలు నాకు పుష్కలంగా ఉన్నాయి. ముస్లిం మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ అంటే అభిమానం, ఆత్మీయత ఉంది. పెద్దిరెడ్డి కుటుంబం పేదల పక్షాన నిలుస్తుందని అన్నమయ్య, చిత్తూరు జిల్లా వాసులందరికి తెలుసు. ఏ అవసరం ఉన్నా..నేనున్నా అంటూ ముందుకొచ్చే కుటుంబం ఏది అంటే పెద్దిరెడ్డి కుటుంబమే. దైవబలం, ప్రజాబలంతో అఖండ విజయం సాధిస్తానన్న నమ్మకం ఉంది.
ప్రజలకు ఏ అవసరమున్నా..
నేను ముందుంటా
రాష్ట్రంలో మళ్లీ ఫ్యాన్ ప్రభంజనం
జగన్ ఆశయాలకు అనుగుణంగా
ముందుకెళ్తా
సంక్షేమం, అభివృద్ధినే ప్రజలు చూస్తారు
ప్రజలే నా బలం

నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు