తిరుమలలో నిరంతరాయంగా నిత్యాన్నదానం

YV Subba Reddy Comments On TTD Free Food donation - Sakshi

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

తిరుమల/తిరుపతి రూరల్‌: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. సంప్రదాయ భోజనంపై సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేయడం తగదన్నారు. సంప్రదాయ భోజనాన్ని టీటీడీ విక్రయించడం లేదన్నారు. దీనికి సంబంధించిన ట్రయల్‌ రన్‌ విజయవంతం కాకపోవడంతో నిలుపుదల చేస్తున్నట్టు ప్రకటించారు. టీటీడీ పాలక మండలి లేని సమయంలో అధికారులు ఒక మంచి ఉద్దేశంతో గో ఆధారిత ఉత్పత్తులతో తయారు చేసిన సంప్రదాయ భోజనం భక్తులకు అందించాలని ఆలోచన చేశారని, దీనిని మాత్రమే నిలిపి వేస్తున్నామని ఆయన తెలిపారు. సోషల్‌ మీడియాలో కొందరు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని.. భక్తులు నమ్మొద్దని ఆయన కోరారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అసత్య ఆరోపణలతో దుష్ప్రచారం చేసే వారిపై కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  

నవనీత సేవ ప్రారంభం
 శ్రీవారికి వెన్న సమర్పించే నవనీత సేవను శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని సోమవారం ప్రారంభించారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కేఎస్‌ జవహర్‌రెడ్డి గోశాల నుంచి వెన్న తీసుకుని ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుని అర్చకులకు అందజేశారు. ముందుగా పెద్ద జీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామి, చైర్మన్, ఈవో వెన్న తయారీని పరిశీలించారు. వెన్న తీసుకెళ్లి స్వామికి సమర్పించేందుకు గాను 1.12 కేజీల వెండి గిన్నెను టీటీడీ ఈవో కేఎస్‌ జవహర్‌రెడ్డి బహూకరించారు.   

ఏనుగుల ఘీంకారం 
వెన్న ఊరేగింపు సందర్భంగా ఏనుగుల ఘీంకారం భక్తులను భయాందోళనలకు గురి చేసింది. ఊరేగింపు మొదట్లో గోశాల వద్ద శ్రీవారి వృషభం అటూఇటూ పరుగెత్తేందుకు ప్రయత్నించగా సిబ్బంది నిలువరించారు. అనంతరం ఊరేగింపు శ్రీవారి పుష్కరిణి సమీపంలోని మాడ వీధి మీదుగా వస్తుండగా ఆకస్మాత్తుగా ఏనుగులు ఘీంకారం చేశాయి. పక్కనే ఉన్న మావటిలు వాటిని అదుపుచేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో భక్తులు భయాందోళనలతో పరుగులు తీయగా.. ఏనుగులు మరింత భయానికి గురై ఘీంకారాలు కొనసాగించాయి. భద్రతా సిబ్బంది సహకారంతో ఏనుగులను మావటిలు గోశాలకు తీసుకెళ్లారు.

రెండు, మూడు రోజుల్లో సర్వదర్శనం టికెట్లు 
శ్రీవారి సర్వదర్శన టికెట్లను భక్తులకు రెండు, మూడు రోజుల్లో అందించేలా అధికారులు, జిల్లా యంత్రాంగంతో చర్చిస్తున్నామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సామాన్య భక్తుల విజ్ఞప్తుల మేరకు ప్రస్తుతం అందిస్తున్న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్‌లైన్‌ టికెట్ల కోటాలోనే 20 నుంచి 30 శాతం టికెట్లను సర్వదర్శనం భక్తులకు కేటాయించేలా చూడాలని అధికారులకు సూచించామని తెలిపారు. ప్రస్తుతం కరోనా ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో దీనిపై అధికారులు చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. చైర్మన్‌ ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని టీటీడీ ఈవో కేఎస్‌ జవహర్‌రెడ్డి తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top