ఆటకు ఆర్థిక అండ... దాదాపు రూ.9.60 కోట్ల నగదు ప్రోత్సాహకాలు

YSSAR Sports Incentives About Rs 9.60 Crore Cash - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధితో పాటు క్రీడాకారులకు ఆర్థిక భరోసా కల్పించడంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తోంది. మూడేళ్ల కాలంలో జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పతకాలు సాధించిన 1,500 మంది క్రీడాకారులకు రూ.9,59,99,859 నగదు ప్రోత్సాహకాలను అందజేసింది. సుమారు 80 క్రీడాంశాల్లోని ఆటగాళ్ల ప్రతిభకు పట్టంకడుతూ.. వారిని మరింతగా ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా శిక్షణకు అవసరమైన  ఆర్థిక సాయానిచ్చింది.

అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక విధానమంటూ లేకపోవడంతో చాలామంది క్రీడాకారులు నష్టపోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ క్రీడాప్రోత్సాహకాలను ప్రవేశపెట్టారు. గతంలో ఇచ్చే నగదు మొత్తాన్ని భారీగా పెంచారు. ఇందులో భాగంగానే జాతీయ పోటీల్లో పతకాలు గెలుపొందిన క్రీడాకారులకు రూ.4.58 కోట్లు ఇవ్వడం విశేషం. దీంతో 2014–19 మధ్య కాలంలో పతకాలు సాధించినా అప్పటి ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన ఎందరో క్రీడాకారులకు లబ్ధిచేకూరింది.

ఎన్నికల ముందు హడావుడిగా..
టీడీపీ ఐదేళ్ల పాలనలో రూ.13.76 కోట్లు అందించినప్పటికీ చిన్న క్రీడాకారులకు ఏమాత్రం మేలు జరగలేదు. క్రీడలను కూడా రాజకీయాలతో చూసే చంద్రబాబు ఎన్నికలకు ముందు హడావుడిగా 2018–19లో 115 మందికి రూ.7.75 కోట్లు ఇచ్చారు. అంతకుముందు ఇచ్చింది కేవలం రూ.6 కోట్లు అయితే వీటిల్లో సింహభాగం అంతర్జాతీయ క్రీడాకారులకు కేటాయించినదే కావడం గమనార్హం. జాతీయస్థాయిలో పతకాలు పొందినవారికి నామమాత్రంగా ఆర్థిక సాయం దక్కేది. 

(చదవండి: ఉద్యాన విస్తరణకు డిజిటల్‌ సేవలు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top