
ఏపీఎండీసీ ద్వారా రుణ సేకరణకు బాండ్ల జారీలో అవకతవకలు
ప్రైవేటు వ్యక్తులు నేరుగా ట్రెజరీ నుంచి డబ్బు తీసుకునేలా అనుమతివ్వడమా!
గనులను తాకట్టుపెట్టుకుని అప్పు ఇచ్చినవారు నేరుగా వాటిని అమ్ముకోవచ్చు
ప్రభుత్వ అనుమతి అవసరం లేదు
రిజర్వ్ బ్యాంక్ నిధులను ప్రైవేటు వ్యక్తులు నేరుగా ఎలా తీసుకుంటారు?
దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఎలా అనుమతిస్తుంది? ప్రభుత్వ చర్య రాజ్యాంగ విరుద్ధం
బాండ్ల జారీతో సహా ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయండి
హైకోర్టులో వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రయోజన వ్యాజ్యం
సాక్షి, అమరావతి: అప్పుల విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న రాజ్యాంగ విరుద్ధ చర్యలపై వైఎస్సార్‌సీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా రూ.9 వేల కోట్లను బాండ్ల రూపంలో సేకరించడంలో భారీ అవకతవకలు ఉన్నాయంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి వచ్చే నిధులను.. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా బాండ్ల కొనుగోలుదారులకు మళ్లించేందుకు అనుమతిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైఎస్సార్‌సీపీ నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి ఈ పిల్ వేశారు.
రాష్ట్రంలోని 436 మైనర్ మినరల్ క్వారీల లీజులను, ఖనిజాల హక్కులను పూర్తిగా ఏపీఎండీసీకి నామినేషన్ ప్రాతిపదికన అప్పగిస్తూ ప్రభుత్వం ఏప్రిల్ 24న జారీ చేసిన జీవో 69ను రద్దు చేయాలని హైకోర్టును కోరారు. ఈ జీవో అమలుకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. అలాగే ఏపీఎండీసీ తీసుకునే రుణాలకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తూ జారీ చేసిన జీవో 33ని కూడా అప్పిరెడ్డి తన వ్యాజ్యంలో సవాల్ చేశారు.
తన పరిధిలోకి వచ్చిన 436 మైనర్ మినరల్ క్వారీల లీజులను, ఖనిజాల హక్కులను ఏపీఎండీసీ తన ఆస్తులుగా అప్పు ఇచ్చేవారికి గ్యారెంటీగా చూపనుందని లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఏపీఎండీసీ షెడ్యూల్ ప్రకారం చెల్లింపులు చేయకపోతే గనులు తాకట్టులో పెట్టుకున్న ప్రైవేటు వ్యక్తులు నేరుగా ప్రభుత్వ ట్రెజరీ నుంచి డబ్బు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తోందన్నారు. గనులను తాకట్టు పెట్టుకున్న వ్యక్తులు ప్రభుత్వ అనుమతితో సంబంధం లేకుండా ఇతరులకు లీజుకు ఇచ్చేందుకు, అమ్ముకునేందుకు సైతం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని.. ఇది రాజ్యాంగ విరుద్ధమని అప్పిరెడ్డి తన వ్యాజ్యంలో పేర్కొన్నారు.
ఇది దోపిడీ కిందకే వస్తుంది..
ప్రభుత్వంతో సంబంధం లేకుండా రిజర్వ్ బ్యాంక్ నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులను నేరుగా బాండ్ల కొనుగోలుదారులు తీసుకునేందుకు అనుమతి ఇవ్వడం దారుణం అని అప్పిరెడ్డి అభివర్ణించారు. బాండ్లు కొన్నవారికి చెల్లింపుల నిమిత్తం నిర్దేశిత ఖాతాల్లో మొదటి నెలలోనే 30 శాతం చొప్పున ప్రతి నెల ఉంచాలని, ఏ కారణంతోనైనా ఖజానాలో నిధులు తగ్గిపోతే ఆర్‌బీఐ నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు నేరుగా బాండ్ల కొనుగోలుదారులకు వెళ్లిపోతాయని చెప్పారు.
ప్రైవేటు వ్యక్తులు రాష్ట్ర ట్రెజరీ నుంచి డబ్బులు నేరుగా తీసుకునేందుకు అనుమతి ఇవ్వడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని, ఇలాంటి వెసులుబాట్లు చరిత్రలో ఎప్పుడూ లేవన్నారు. ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ నిధులను విచక్షణారహితంగా దోచిపెట్టడానికే ఈ జీవో తెచ్చారని, ఇది దోపిడీ కిందకే వస్తుందని ప్రజా విశ్వాసానికి, నిర్వర్తించాల్సిన బాధ్యతలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. బాండ్ల జారీతో సహా ప్రభుత్వ రాజ్యాంగ విరుద్ధ చర్యలను అడ్డుకోవాలని హైకోర్టును కోరారు.