బాబు పాలన అంటేనే మోసం గ్యారంటీ | YSRCP President YS Jagan lashes out at Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

బాబు పాలన అంటేనే మోసం గ్యారంటీ

Jul 2 2026 5:20 AM | Updated on Jul 2 2026 5:20 AM

YSRCP President YS Jagan lashes out at Chandrababu Naidu

పక్క రాష్ట్రం కర్ణాటకలో కిలో రూ.17.50 చొప్పున కేంద్రం కొనుగోలు  

ధరలు పతనమైనప్పుడు ఆదుకోవాల్సిన ధరల స్థిరీకరణకు అరకొర నిధులే కేటాయింపు 

రైతులకు సబ్సిడీ విత్తనాల పంపిణీ లేదు.. అందుబాటులో యూరియా లేదు 

గత వైఎస్సార్‌సీపీ పాలనలో రైతుల పంటలకు గ్యారంటీ  

ఒక్క ధరల స్థిరీకరణకే ఐదేళ్లలో రూ.7,800 కోట్లు ఖర్చు 

నిప్పులు చెరిగిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌

మా ప్రభుత్వ హయాంలో రైతు వేసిన పంటకు గ్యారంటీ ఉండేది. ‘నేను నష్టపోను.. ప్రభుత్వం నాకు తోడుగా ఉంటుంది..’ అనే భరోసా ప్రతి రైతుకు ఉండేది. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా పోయింది. మా ప్రభుత్వంలో అమలైన బీమా పథకాన్ని పూర్తిగా రద్దు చేశారు. ఫలితంగా ఇప్పుడు పంట దెబ్బతింటే ఉచిత పంటల బీమా రాదు. పంటల బీమా కింద రైతులకు ఇవ్వాల్సిన రూ.3,500 కోట్లు ఎగ్గొట్టారు. ఏ సీజన్‌లో నష్టం జరిగితే ఆ సీజన్‌ ముగిసేలోగా ఇచ్చే ఇన్‌పుట్‌సబ్సిడీ విధానానికీ పూర్తిగా మంగళం పలికారు. బాబు పాలన అంటే మోసం గ్యారంటీ అని ఈ రోజు ప్రతి రైతుకు స్పష్టంగా కనిపిస్తోంది. 

సీఎం చంద్రబాబు పొగాకు కంపెనీలతో సమావేశమై, కనిష్టంగా కిలోకు రూ.200 తగ్గకూడదని గట్టిగా చెప్పాడని ఎల్లో మీడియా ఊదరగొట్టింది. సీఎం చెప్పాడో లేదో కానీ ఆ మరుసటి రోజే ధర రూ.160కి పడిపోయింది. ఈ సీజన్‌లో దాదాపు 240 మిలియన్‌ కిలోల పొగాకు పండింది. కొనుగోళ్లు మొదలై 75 రోజులైనప్పటికీ కొన్నది కేవలం 29 మిలియన్‌ కిలోలు మాత్రమే. ఇలా అయితే రైతులు రోడ్లెక్కక ఏం చేస్తారు?  

కేంద్ర మంత్రి కుమార స్వామి లేఖ రాయడంతో కర్ణాటకలో మార్కెట్‌ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్రం సహాయ సహకారాలతో 1.3 లక్షల టన్నుల తోతాపురి మామిడిని కిలో రూ.17.50 చొప్పున కొన్నారు. అదే కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు ఆ మాత్రం ధర వచ్చేలా ఎందుకు ప్రయత్నించలేదు? కిలోకు రూ.17.50 ఇవ్వండని కోరాల్సింది పోయి.. కిలోకు కేవలం రూ.4 ఇస్తే చాలని మాత్రమే లేఖ రాశారంటే రైతుల పట్ల ఈ పెద్దమనిషికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో ఇట్టే అర్థమవుతోంది.  

యూరియా అతిగా వాడకంతో క్యాన్సర్‌ వస్తుందని, అందుకే ఎక్కువగా అందుబాటులో లేకుండా చేశామని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నాడు. ఏ పంటకు ఎంత యూరియా వేయాలో రైతులకు తెలియదా? ఎంత అవసరమో అంతే వేస్తారు కదా.. పైగా వరి పంటకు యూరియా ఎక్కువ వేస్తే పంట నాశనం అవుతుంది. ముందు చంద్రబాబు పంటలకు ఎంత యూరియా వేయాలో తెలుసుకోవాలి. అప్పుడే ఎరువుల అంచనాలపై స్పష్టత వస్తుంది.   - వైఎస్ జగన్‌

సాక్షి, అమరావతి : ‘పొగాకు, మామిడి, రొయ్య ఇలా రాష్ట్రంలో రైతులు పండించిన ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. తీవ్రంగా నష్టాలపాలైన అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. ప్రతి జిల్లాలో ఇదే సమస్య కనిపిస్తోంది. రైతులంతా ఆందోళనలు చేస్తూ రోడ్లపై కనిపిస్తున్నారు. కానీ.. ఇవేమీ చంద్రబాబు ప్రభుత్వానికి పట్టడం లేదు. మన పాలన అంటే రైతుల పంటలకు గ్యారంటీ అని, బాబు పాలన అంటే మోసం గ్యారంటీ’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. 

వైఎస్సార్‌సీపీ హయాంలో రైతులకు అండగా నిలిచిన, భరోసా ఇచ్చిన ఆర్బీకే, ఈ–క్రాప్, పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, ధరల స్థిరీకరణ నిధి.. ఇలా అన్నింటినీ రెండేళ్లలో చంద్రబాబు భ్రష్టు పట్టించేశారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు రైతులను పూర్తిగా గాలికి వదిలేసి.. అవినీతి, దోపిడీ రెడ్‌బుక్‌ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. తమ ఐదేళ్ల పాలనలో ఎరువుల కోసం రాష్ట్రంలో ఎక్కడైనా రైతులు బారులు తీరిన సందర్భాలున్నాయా.. బ్లాక్‌లో ఎరువులు కొనుగోలు చేసిన దాఖలాలున్నాయా.. అని ప్రశ్నించారు. 

ఇవన్నీ ఈ రెండేళ్లలోనే కనిపించాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు సమస్యల పరిష్కారంలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను సాక్ష్యాధారాలతో నిలదీశారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..   

బాబు పాలనంటే మోసం గ్యారంటీ 
‘రాష్ట్రంలో ఎక్కడ చూసినా పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అయినా చంద్రబాబుకు పట్టడం లేదు. మూడు బడ్జెట్లు పెట్టినా, ధరల స్థిరీకరణ నిధికి అరకొర నిధులే ఇచ్చారు. అదే మా హయాంలో ప్రతి ఏటా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టాం. ఆర్బీకేల్లో పోస్టర్ల ద్వారా పంటల వారీగా గిట్టుబాటు ధరలు ప్రదర్శించాం. ఏ పంటకు గిట్టుబాటు ధర లేకున్న ఆర్బీకే పరిధిలోనే (కంటిన్యూయెస్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ప్రైస్‌ అండ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ (సీఎం–యాప్‌) యాక్టివేట్‌ (క్రియాశీలకం) అయ్యేది. తద్వారా ఆర్బీకేలోని అసిస్టెంట్‌ సందేశం పంపితే, మార్క్‌ఫెడ్‌ అక్కడ రంగంలోకి దిగేది. పంటలు కొనేవాళ్లు. దీంతో మార్కెట్‌లో పోటీ వచ్చి రేట్లు పెరిగేవి. 

మేం ఐదేళ్లలో రూ.7,800 కోట్లు ఖర్చుపెడితే, చంద్రబాబు ధరల స్థిరీకరణ నిధిని భ్రష్టు పట్టించాడు. మా ప్రభుత్వ హయాంలో రైతు వేసిన పంటకు గ్యారంటీ ఉండేది. నేను నష్టపోను.. ప్రభుత్వం నాకు తోడుగా ఉంటుంది.. అనే భరోసా ప్రతి రైతుకు ఉండేది. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా పోయింది. ఇప్పుడు పంట దెబ్బతింటే ఉచిత పంటల బీమా లేదు. మా ప్రభుత్వంలో అమలైన బీమా పథకాన్ని పూర్తిగా రద్దు చేశారు. పంటల బీమా కింద రైతులకు ఇవ్వాల్సిన రూ.3,500 కోట్లు ఎగ్గొట్టారు. ఏ సీజన్‌లో నష్టం జరిగితే ఆ సీజన్‌ ముగిసేలోగా ఇచ్చే ఇన్‌పుట్‌ సబ్సిడీ విధానానికి పూర్తిగా మంగళం పలికారు. బాబు పాలన అంటే మోసం గ్యారంటీ అని ఈ రోజు ప్రతి రైతుకు స్పష్టంగా కనిపిస్తోంది.  

సీఎంను కలిసిన 24 గంటల్లో ధరలు ఢమాల్‌ 
వరుసగా రెండో ఏడాది కూడా పొగాకు ధరలు పడిపోతున్నాయి. గతేడాది ఇదే పరిస్థితి తలెత్తితే నేను వెళ్లి రైతులకు అండగా నిలిచాను. మా ప్రభుత్వంలో చరిత్రలో తొలిసారిగా పొగాకు వేలం ప్రక్రియలోకి మార్క్‌ఫెడ్‌ను దించాం. రైతులకు గిట్టుబాటు ధర ఇస్తూ కొనుగోలు చేశాం. మార్కెట్‌లో పోటీని సృష్టించాం. దీంతో పొగాకు రైతులకు మా హయాంలో భరోసా ఉండేది. రాష్ట్రంలో పొగాకు పంటలకు 2023–24లో గరిష్ట ధర దక్కిందని ఏకంగా కేంద్ర వాణిజ్య శాఖ సైతం ప్రకటించింది. కిలోకు సగటున రూ.285 ధర దక్కిందని, అత్యధికంగా రూ.411 దక్కిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 

ఈ రోజున వరుసగా రెండో ఏడాది పొగాకు రైతులు రోడ్ల మీద కనిపిస్తున్నారు. సీఎం చంద్రబాబు పొగాకు కంపెనీలతో సమావేశమై, కనిష్టంగా కిలోకు రూ.200 తగ్గకూడదని గట్టిగా చెప్పాడని ఎల్లో మీడియా ఊదరగొట్టింది. సీఎం చెప్పాడో లేదో కానీ ఆ మరుసటి రోజే ధర రూ.160కి పడిపోయింది.    ఈ సీజన్‌లో దాదాపు 240 మిలియన్‌ కిలోల పొగాకు పండింది. కొనుగోళ్లు మొదలై 75 రోజులైనప్పటికీ కొన్నది కేవలం 29 మిలియన్‌ కిలోలు మాత్రమే. ఇలా అయితే రైతులు రోడ్లెక్కక ఏం చేస్తారు? 

అప్సడా చట్టం నిర్వీర్యం 
మా ప్రభుత్వ హయాంలో ఆక్వా రైతులకు అండగా నిలుస్తూ ఏపీ ఆక్వా కల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (అప్పడా) చట్టాన్ని తెచ్చాం. దీనికి స్వయంగా సీఎం చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆక్వా ఫీడు, సీడు సహా, ఆక్వా కొనుగోలు ధరలను క్రమబద్ధీకరించే అధికారం అప్సడాకు ఉంది. ఇంతటి పకడ్బందీ వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. అప్సడా అంగీకారం, రైతుల ఆమోదం లేకుండానే, చట్టాన్ని బేఖాతరు చేస్తూ కంపెనీలన్నీ కుమ్మక్కై ఏప్రిల్‌లో ఒక దఫా, జూన్‌లో మరో దఫా కింద ఫీడ్‌ ధర కేజీకి రూ.14 నుంచి రూ.16 వరకు ధరలు పెంచాయి. 

రెండో వైపు పంట చేతికి వచ్చే సమయానికి రేట్లు పతనం అయ్యాయి. 100 కౌంట్‌ రొయ్యల ధర రూ.270 నుంచి రూ.220–240 మధ్యకు పడిపోయింది. ఫీడ్‌ ధరల పెరుగుదలతోపాటు రొయ్యల ధర పతనం అవుతుంటే రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వారికి మేం అండగా నిలిచాం. ఆక్వా రైతులు వచ్చి నన్ను కలిశాక, వారి తరఫున వైఎస్సార్‌సీపీ నిలబడుతుందని భరోసా ఇచ్చాక చంద్రబాబులో చలనం వచ్చింది. ఫీడు ధర కిలోకు రూ.4 తగ్గించాలని సీఎం ఆదేశించారని ఎల్లో మీడియాలో రాశారు. తీరా చూస్తే కేవలం రూ.2 మాత్రమే తగ్గించారు. ఫీడ్‌ ధర కేజీకి రూ.14–16 పెంచి.. రూ.2 తగ్గిస్తే తగ్గించినట్టా? 

ఒక్క బాధిత కుటుంబాన్నీ ఆదుకోని ప్రభుత్వం
రెండేళ్లలో 540 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే బాధిత కుటుంబాలకు ఒక్క రూపాయి సాయం చేయలేదు. పైగా కాడెద్దులు నదిలో చనిపోతే చంద్రబాబు చలించిపోయారట! ఈయన చేసిన మోసానికి 540 మంది చనిపోతే ఒక్కరికీ ఒక్క రూపాయి ఇవ్వలేదు. కాడెద్దులు చనిపోతే కకావికలం అయిపోయి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశాలిచ్చారని ఏబీఎన్, ఈనాడు, టీవీ5 ఎల్లో మీడియా డబ్బా కొడుతోంది. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ప్రస్తుతం ఇసుక, మట్టి, సిలికా, లేటరైట్, రేషన్‌ బియ్యం మాఫియా, అమరావతి పేరిట అంతులేని దోపిడీ, పప్పుబెల్లాలుగా ఖరీదైన భూములు ధారాదత్తం.. ఎమ్మార్పీ కంటే అధిక రేట్లకు బెల్టు షాపుల్లో మద్యం అమ్మకాలు చేసే లిక్కర్‌ మాఫియా మాత్రమే కనిపిస్తున్నాయి. 

ఇవి చాలదన్నట్టుగా బీచ్‌ షాక్స్‌ అంటున్నారు. ఈ సంస్కృతి ప్రవేశపెడితే కుటుంబంతో సరదాగా ఎవరైనా బీచ్‌లకు వెళ్లగలరా? ఆర్టీసీని అమ్మకానికి పెట్టేశారు. మేం తెచ్చిన కొత్త వైద్య కళాశాలలు, హార్బర్‌లు, పోర్ట్‌లను పప్పుబెల్లాలుగా ప్రైవేటీకరిస్తున్నారు. వీటిపై ఎవరైనా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు, అక్రమ అరెస్ట్‌లు, లాకప్‌ డెత్‌లు, రెడ్‌బుక్‌ రాజ్యాంగం ద్వారా వేధింపులకు పాల్పడుతున్నారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులేమో గానీ, ఆ సాకుతో అబ్బా కొడుకులు దోచుకున్నది విదేశాల్లో దాచుకుంటున్నారు’ అని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు.    

బాబు తపనంతా గల్లా, శ్రీని ఫుడ్స్‌ మేలు కోసమే...
గత ఏడాది తోతాపురి మామిడి ధర విషయంలో నెలకొన్న సంక్షోభం ఇంకా మన కళ్లముందే ఉంది. అప్పట్లో రైతులకు సంఘీభావంగా బంగారుపాళ్యం మార్కెట్‌ యార్డుకు నేనూ వెళ్లాను. రైతులకు తోడుగా నిలిచాను. గతేడాది సంక్షోభమే మళ్లీ ఇప్పుడు ఉంది. రైతులు పంట అంతా తెగనమ్ముకుంటున్న దుస్థితి. కిలోకు రూ.12 ఇస్తామని గతేడాది అన్నారు. ఇందులో రూ.4 రాష్ట్ర ప్రభుత్వం, రూ.8 కంపెనీలు ఇస్తాయన్నారు. కానీ ఏ కంపెనీ కూడా రూ.8 చొప్పున ఇవ్వలేదు. ఇప్పుడు మళ్లీ రెండో ఏడాది రైతులు రోడ్లెక్కుతున్నారు. ఒక కిలో మామిడి పండించడానికి రైతులకు కిలోకు రూ.15 ఖర్చు అవుతుంటే.. పండించిన మామిడికి కిలోకు రూ.5 కూడా దక్కడం లేదు. 

ధరల పతనం ఉత్పన్నం అవ్వక ముందే పక్క రాష్ట్రం కర్ణాటకలో మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీమ్‌ కింద కేంద్రం సహాయ సహకారాలతో 1.3 లక్షల టన్నుల తోతాపురి మామిడిని కిలో రూ.17.50 చొప్పున  కొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి, కేంద్ర మంత్రి కుమార స్వామి జూన్‌ 24న లేఖరాస్తే, జూన్‌ 25న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ నుంచి మామిడి కొనుగోలుకు సానుకూల స్పందన వచ్చింది. రాష్ట్రంలో మామిడి రైతుల పరిస్థితి ఎంతో దారుణంగా ఉన్నప్పటికీ చంద్రబాబు మాత్రం నిద్ర లేవడం లేదు. 

కుమారస్వామి మాదిరిగానే చంద్రబాబు కూడా ఎన్డీఏ భాగస్వామి. కుమారస్వామి లేఖ రాసి.. కేంద్రం సానుకూలంగా స్పందించి.. సోషల్‌ మీడియాలో ఇదంతా వైరల్‌ అయ్యాక జూన్‌ 28న చంద్రబాబు లేఖ రాశారు. ఆ లేఖలో కూడా కిలోకు రూ.17.50 ఇవ్వమని రాయలేదు. కిలోకు రూ.4 ఇస్తామని, ఆ డబ్బు కేంద్రం నుంచి ఇవ్వాలంటూ మాత్రమే రాశాడు. రైతులకు రూ.17.50 వచ్చేలా చేయాలనే ఉద్దేశం కూడా చంద్రబాబుకు లేదు. ఎంతసేపు గల్లా ఫుడ్స్, శ్రీని ఫుడ్స్‌కు మేలు చేయాలనేదే చంద్రబాబు తపన.  

యూరియా ఎక్కువ వాడుతున్నారని బుకాయింపు
పండిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే, మరో వైపు ఖరీఫ్‌ సబ్సిడీ విత్తనాల పంపిణీ ఊసే లేదు. ఎక్కడైనా విత్తనాలు సబ్సిడీపై పంపిణీ ఉంటే మార్కెట్‌లో ఆటోమేటిక్‌గా రేట్లు తగ్గుతాయి. చంద్రబాబు పుణ్యమా అని సబ్సిడీ విత్తనాలు అందక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని ప్రైవేట్‌ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. కేవలం రెండేళ్ల చంద్రబాబు పాలనలోనే రైతుల పెద్ద పెద్ద క్యూలు, యూరియా దొరక్క ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

మా ఐదేళ్ల పాలనలో యూరియా దొరక్క రైతులు ఇబ్బందులు పడ్డ ఘటనలు ఎక్కడైనా కనిపించాయా? మా ప్రభుత్వ హయాంలో రైతులు సాగు చేసే పంటలపై ముందస్తుగా అంచనా వేశాం. ఆర్బీకేల వారీగా పక్కాగా వివరాలు సేకరించి, వారి చెంతకే ఎరువులు చేర్చాం. బస్తాకు రూ.50 తక్కువకు ఎరువులు సరఫరా చేశాం. ఈ రోజు పరిస్థితి అంతా రివర్స్‌. కౌలు రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దీనికి చంద్రబాబు చెప్పే కారణం భలే విచిత్రంగా ఉంది. యూరియా అతిగా వాడకంతో క్యాన్సర్‌ వస్తుందట. అందుకే ఈ పరిస్థితి తెచ్చానని ప్రచారం చేసుకుంటున్నాడు. ఏ పంటకు ఎంత యూరియా వేయాలో రైతుకు తెలియదా? రైతులు ఎక్కువ ధర పెట్టి, ఎక్కువ యూరియాను పంటలకు ఎందుకు వేస్తారు? ఎంత అవసరమో అంతే వేస్తారు కదా.. పైగా వరి పంటకు యూరియా ఎక్కువ వేస్తే పంట నాశనం అవుతుంది. 

ముందు చంద్రబాబు పంటలకు ఎంత యూరియా వేయాలో తెలుసుకోవాలి. అప్పుడు ఎరువుల అంచనాలపై స్పష్టత వస్తుంది. ఈ క్రాప్, ఆర్బీకే ఇలా అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేశారు. ఇలాంటి ఆయనకు ఎంత ఎరువులు కావాలో ఎలా తెలుస్తుంది? పీఎం కిసాన్‌ కాకుండా ప్రతి కుటుంబానికి రూ.20 వేలు ఇస్తామన్నారు. మూడేళ్లయింది. రూ.60 చొప్పున ఇవ్వాలి. కానీ ఇచ్చింది రూ.19 వేలు మాత్రమే. ఇలా అయితే రైతులు ఎలా బాగుపడతారు? పంటల బీమా కింద రూ.3,500 కోట్లు ఎగ్గొట్టారు. గతేడాది మోంథా తుపానులో నష్టపోయిన రైతులకు ఇప్పటి దాక ఒక రూపాయి కూడా ఇవ్వలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement