టీడీపీ బూతు పురాణంపై ఉవ్వెత్తున ఎగసిన జనాగ్రహం

YSRCP Leaders Second Day Protest Against Pattabhi Comments On CM YS Jagan In AP - Sakshi

బూతు వ్యాఖ్యలను సమర్థిస్తూ చంద్రబాబు దీక్ష చేయడంపై మండిపడ్డ జనం

తక్షణమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌

లేదంటే తగిన రీతిలో బుద్ధి చెబుతామంటూ హెచ్చరిక

వైఎస్సార్‌సీపీ జనాగ్రహ దీక్షలకు పోటెత్తిన పార్టీ శ్రేణులు, ప్రజలు

సాక్షి,అమరావతి/సాక్షి,నెట్‌వర్క్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభితో అసభ్య పదజాలంతో దూషింపజేయడంపై జనాగ్రహం ఉవ్వెత్తున ఎగసింది. బూతు వ్యాఖ్యలపై సీఎం వైఎస్‌ జగన్‌కు క్షమాపణ చెప్పాల్సిందిపోయి.. వాటిని సమర్థిస్తూ చంద్రబాబు దీక్ష చేయడమేమిటి? అంటూ ప్రజలు నిలదీశారు. వాక్‌ స్వాతంత్య్రం అంటే బూతులు తిట్టడమేనా? అని ప్రశ్నించారు. ఇది అనైతికం.. అధర్మం.. దుర్మార్గం అని స్పష్టం చేశారు. తక్షణమే సీఎం వైఎస్‌ జగన్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.


గుంటూరు జిల్లా వేమూరు నుంచి పాదయాత్ర చేపట్టిన ఎమ్మెల్యే మేరుగ నాగార్జునకు తెనాలిలో స్వాగతం పలికిన ఎమ్మెల్యే అన్నాబత్తుని, ఇతర నేతలు
లేదంటే.. ప్రజాక్షేత్రంలో మళ్లీ మళ్లీ తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సీఎం వైఎస్‌ జగన్‌ను బూతులు తిట్టించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ గురువారం చేపట్టిన జనాగ్రహ దీక్షలు శుక్రవారం కూడా కొనసాగాయి. ఈ దీక్షల్లో ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. 2019 ఎన్నికల్లో ఆఖండ విజయంతో అధికారం చేపట్టిన సీఎం వైఎస్‌ జగన్‌.. ఎన్నికల మేనిఫెస్టోలోని 95 శాతానికిపైగా హామీలను తొలి ఏడాదే అమలు చేసి రాజకీయాల్లో సరి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని ప్రజలు ప్రశంసించారు.

కృష్ణా జిల్లా పామర్రు 4 రోడ్ల కూడలిలో శుక్రవారం జనాగ్రహ దీక్షలో పాల్గొన్న వైఎస్సార్‌ సీపీ మహిళా అధ్యక్షురాలు కైలే జ్ఞానమణి, మహిళా ప్రతినిధులు
కులం, మతం, వర్గం, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకూ సంక్షేమాభివృద్ధి పథకాలను అందించడం ద్వారా ప్రజాస్వామ్యానికి సరి కొత్త నిర్వచనం చెప్పారని కొనియాడారు. నామినేటెడ్‌ పదవుల్లో, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు కేటాయించడం ద్వారా సరి కొత్త సామాజిక రాజకీయ విప్లవానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా సంక్షేమ పథకాల ద్వారా దన్నుగా నిలిచారని ప్రశంసించారు.

ప్రజాదరణను జీర్ణించుకోలేకే కుట్రలు 
సీఎం వైఎస్‌ జగన్‌ తమ కష్టనష్టాల్లో వెన్నంటి ఉన్నందుకే పంచాయతీ, మున్సిపల్, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు, తిరుపతి లోక్‌సభ ఎన్నికల్లో ఆయన వెంట నడిచామని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రజలు స్పష్టం చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌కు నానాటికీ పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే చంద్రబాబు ఎప్పటికప్పుడు విద్వేషాలను రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు, శ్రేణులు మండిపడ్డాయి. తొలుత దేవాలయాలపై దాడులు చేయించి.. విగ్రహాలను ధ్వంసం చేయించి.. రథాలకు నిప్పు పెట్టించి మత కల్లోలాలను సృష్టించడానికి చంద్రబాబు కుట్రలు చేశారని ఎత్తిచూపారు.

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో నిర్వహించిన జనాగ్రహ దీక్షలో మాట్లాడుతున్న మంత్రి ఆదిమూలపు సురేష్‌
ఆ తర్వాత వ్యవస్థలను అడ్డం పెట్టుకుని.. స్థానిక సంస్థల ఎన్నికలను అపహాస్యం చేశారని ధ్వజమెత్తారు. గుజరాత్‌లో దొరికన మాదక ద్రవ్యాలకూ.. ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర నిఘా సంస్థలు స్పష్టం చేసినా, డీజీపీ గౌతం సవాంగ్‌ తేల్చి చెప్పినా చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ నేతలు నానా యాగీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని చేసినా ప్రజలు నమ్మడం లేదని ఇప్పుడు పట్టాభి ద్వారా సీఎంను బూతులు తిట్టించి రాష్ట్రంలో అలజడులు రేపేలా కుట్ర పన్నారని నిప్పులు చెరిగారు.

పశ్చిమగోదావరి జిల్లా మార్టేరులో నిర్వహించిన జనాగ్రహ దీక్షలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తదితరులు

మిన్నంటిన నిరసనలు  
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జనాగ్రహ దీక్షలు కొనసాగాయి. కుప్పంలో టీడీపీ నేతలు రెచ్చగొట్టడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు అడ్డుకుని బారికేడ్లు ఏర్పాటు చేశారు. బాబు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండు వద్ద చంద్రబాబు దిష్టి బొమ్మను దహనం చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభి చిత్రపటాలను గాడిదకు కట్టి ఊరేగించారు. శ్రీకాళహస్తిలో టీడీపీ నేతల వైఖరిని  హిజ్రాలు తప్పుపట్టారు. 
 టీడీపీ తీరును నిరసిస్తూ అనంతపురం జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. పలు చోట్ల చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. చంద్రబాబు క్షమాపణలు చెప్పాల్సిందేనని కర్నూలు జిల్లాలో పార్టీ నేతలు డిమాండ్‌ చేశారు. మాజీ మేయర్‌ బంగి అనంతయ్య గుండు కొట్టించుకుని నిరసన తెలిపారు. వైఎస్సార్‌ జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు బాబు వైఖరిపై నిప్పులు చెరిగాయి.  
 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు.. చంద్రబాబు తీరు మార్చుకోకపోతే తీవ్ర పర్యవసానాలు తప్పవని హెచ్చరించారు. కృష్ణా జిల్లాలో చంద్రబాబు, పట్టాభి దిష్టి బొమ్మలను తగులబెట్టారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో  తీవ్ర నిరసన వ్యక్తమైంది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 
విశాఖ నగరంతో పాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో టీడీపీ నేతల తీరును విమర్శిస్తూ ధర్నాలు, దీక్షలు, ర్యాలీలు హోరెత్తాయి. వెంటిలేటర్‌పై ఉన్న పార్టీ, కొడుకు లోకేష్‌ భవిష్యత్తు ఏమవుతుందోనన్న బెంగతో చంద్రబాబు విచక్షణ కోల్పోయి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు.  
టీడీపీ ఉనికి కోల్పోవడం ఖాయం అని విజయనగరం, శ్రీకాళుళం జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ధ్వజమెత్తాయి. నల్ల రిబ్బన్లు ధరించి టీడీపీ వైఖరికి నిరసన తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top