
కేజీహెచ్‌లో బాలికలను పరామర్శిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు పుష్పశ్రీ వాణి, రాజన్న దొర, తనూజా రాణి, మజ్జి శ్రీనివాసరావు, పరీక్షిత్ రాజు
ఇద్దరు బాలికల మరణం బాధాకరం
ఆ చిన్నారుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలి
వైఎస్సార్‌సీపీ నాయకులు పుష్పశ్రీవాణి, రాజన్నదొర, తనూజారాణి, మజ్జి శ్రీను ధ్వజం
మహారాణిపేట(విశాఖపట్నం): కురుపాం గిరిజన బాలికల పాఠశాల విద్యార్థినులు అస్వస్థతకు గురికావడం, ఇద్దరు బాలికలు చనిపోవడానికి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, దీనికి సర్కారే బాధ్యత వహించాలని వైఎస్సార్‌సీపీ నేతలు, మాజీ ఉప ముఖ్యమంత్రులు పాముల పుష్పశ్రీ వాణి, పి.రాజన్నదొర ధ్వజమెత్తారు. ఆదివారం విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న కురుపాం గిరిజన బాలికలను పుష్పశ్రీవాణి, రాజన్నదొర, అరకు ఎంపీ డాక్టర్ తనూజారాణి, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్ రాజు తదితరులు పరామర్శించారు. అనంతరం కేజీహెచ్ వైద్యులతో మాట్లాడి విద్యార్థులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పుష్పశ్రీ వాణి మాట్లాడుతూ గిరిజన గురుకుల పాఠశాలల నిర్వహణను కూటమి సర్కారు గాలికొదిలేసిందని విమర్శించారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అసమర్థురాలని ధ్వజమెత్తారు. పాఠశాల హాస్టల్లో కలుషిత నీరు తాగి పచ్చకామెర్ల బారిన పడి అంజలి, కల్పన అనే ఇద్దరు విద్యార్థులు మృతిచెందారని, సుమారు 120 మంది ఆస్పత్రి పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన చిన్నారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అంజలి మృతికి నాటు వైద్యం కారణమని సర్కారు సాకులు వెతుకుతోందని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో ఒక్క గురుకుల పాఠశాలకు కూడా ఈ సర్కారు దోమతెరలు ఇవ్వలేదని మండిపడ్డారు. ఆదివారం తీరుబడిగా స్పందించిన మంత్రి సంధ్యారాణి పాఠశాలల్లో నీరు బాగానే ఉందని చెప్పడం దారుణమని పేర్కొన్నారు. ఇద్దరు చిన్నారులు కలుషిత నీరు వల్లే చనిపోయారని, కల్పన సికిల్ సెల్ అనేమియాతో చనిపోయిందని మంత్రి ప్రకటించడం పచ్చి అబద్ధమని పేర్కొన్నారు. ఎంపీ డాక్టర్ తనూజా రాణి మాట్లాడుతూ కూటమి సర్కారు ఆశ్రమ పాఠశాలల్లో కనీస వసతులు కలి్పంచడం లేదని మండిపడ్డారు. కలుషిత నీరే ఇద్దరు చిన్నారులను బలిగొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతమంది పిల్లలు పచ్చకామెర్ల బారిన పడుతుంటే కూటమి సర్కారు చోద్యం చూస్తోందని ధ్వజమెత్తారు.
వైద్యానికి డబ్బులు లేవని ఐటీడీఏ పీఓ చెప్పడం దారుణం
మాజీ ఉప ముఖ్యమంత్రి పి.రాజన్నదొర మాట్లాడుతూ గిరిజన పిల్లల వైద్యం కోసం డబ్బులు లేవని ఐటీడీఏ పీఓ చెప్పడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. పేద చిన్నారులకు వైద్యం చేయించలేని మంత్రి, సర్కారు పెద్దలు పదవుల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి సర్కారు నిర్లక్ష్యం వల్లే ఇంతమంది పిల్లలు ఆస్పత్రుల పాలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చకామెర్లు చిన్న వ్యాధి అని కూటమి ప్రతినిధులు వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారులను, వారి వెంట ఉన్న తల్లిదండ్రులను పట్టించుకునే నాథుడు లేడని, పర్యవేక్షణకు ఒక్క అధికారినీ నియమించలేదని విమర్శించారు.
