వైఎస్సార్‌సీపీకి మండలిలో పూర్తి మెజార్టీ

YSRCP Have Majority MLCs In Legislative Council Andhra Pradesh - Sakshi

సంపూర్ణ ఆధిక్యం సాధించిన అధికార పార్టీ

21కి పెరిగిన వైఎస్సార్‌సీపీ బలం

15కి పరిమితమైన టీడీపీ 

సాక్షి, అమరావతి: శాసన మండలిలో టీడీపీ ఆధిపత్యానికి అడ్డుకట్ట పడింది. తాజాగా ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియడంతో టీడీపీ బలం తగ్గిపోయింది. అదే సమయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బలం పెరిగింది. ప్రస్తుతం మండలిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బలం 21 కాగా టీడీపీ బలం 15కి తగ్గింది. శుక్రవారంతో 8 మంది ఎమ్మెల్సీల పదవీకాలం ముగియగా వారిలో టీడీపీకి చెందిన ఏడుగురు, వైఎస్సార్‌సీపీకి చెందిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నారు. ఎమ్మెల్సీలుగా డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం, వైవీబీ రాజేంద్రప్రసాద్, బుద్ధా వెంకన్న, పప్పుల చలపతిరావు, గాలి సరస్వతి, ద్వారపురెడ్డి జగదీశ్వరరావు, బుద్ధా నాగజగదీశ్వరరావుల పదవీకాలం ముగిసింది. గత నెల 24వ తేదీన మండలి చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ సైతం పదవీ విరమణ చేశారు. వాకాటి నారాయణరెడ్డి బీజేపీలో చేరడం, చదిపిరాల శివనాథ్‌రెడ్డి పార్టీకి దూరం కావడంతో టీడీపీ బలం 15కి తగ్గిపోయింది. 

బిల్లులను అడ్డుకోవటమే లక్ష్యంగా...
సాధారణ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన టీడీపీ మండలిలో ఇటీవల వరకు ఉన్న ఆధిక్యంతో  ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమైన బిల్లుల్ని అడ్డుకోవడమే లక్ష్యంగా వ్యవహరించింది. పాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల బిల్లులకు మోకాలడ్డింది. పేద విద్యార్థులకు ఆంగ్ల మాథ్యమంలో విద్యనందించే బిల్లును సైతం కుట్రతో అడ్డుకుంది. సలహాలివ్వాల్సిన పెద్దల సభను రాజకీయ వేదికగా మార్చుకుని అడ్డంకులు సృష్టించింది. అయితే శాసనమండలిలో ఇప్పుడు వైఎస్సార్‌సీపీ పూర్తి మెజారిటీ సాధించింది.

మరింత పెరగనున్న అధికార పార్టీ బలం..
మండలిలో వైఎస్సార్‌సీపీ తరఫున 18 మంది (గవర్నర్‌ నామినేట్‌ చేసిన నలుగురితో కలిపి) సభ్యులున్నారు. కొద్దిరోజుల క్రితం టీచర్‌ ఎమ్మెల్సీగా ఎన్నికైన కల్పలత, స్వతంత్ర ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, టీడీపీకి దూరంగా ఉన్న శివనాథ్‌రెడ్డి కూడా వైఎస్సార్‌సీపీకి మద్దతు ప్రకటించారు. దీంతో ప్రస్తుతం అధికార పార్టీ బలం 21కి పెరిగింది. ఇవికాకుండా ఎమ్మెల్యేల కోటాలో మూడు, స్థానిక సంస్థల కోటాలో 11 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కరోనా కారణంగా ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల ఎన్నిక వాయిదా పడింది. అవి ఎప్పుడు జరిగినా వైఎస్సార్‌సీపీనే గెలుచుకునే పరిస్థితి ఉంది. ఇక మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల సరళిని బట్టి చూస్తే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ విజయం సాధించడం లాంఛనంగానే కనిపిస్తోంది. ఆ కోటాలోని 11 ఎమ్మెల్సీలూ అధికార పార్టీకే దక్కే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మండలిలో ఆధిపత్యంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ రాబోయే రోజుల్లో మరింత బలం పెంచుకునే పరిస్థితి స్పష్టంగా  కనిపిస్తోంది.
చదవండి: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై అప్పీల్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top