సమగ్ర భూ సర్వేలో వైఎస్సార్‌ జగనన్న కాలనీలు

YSR Jagananna Colonies In Comprehensive Land Survey - Sakshi

మ్యాపుల తయారీలో చేర్చి ప్రతి ఇంటికీ యూనిక్‌ ఐడీ నంబరు 

ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశం 

భూ సర్వే పూర్తయిన గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు 

సచివాలయ ఉద్యోగుల సమర్ధత పెంచేందుకు శిక్షణ, పరీక్షలు 

సర్వేయరు నుంచి జేసీ వరకు ఎస్‌వోపీలు ఉండాలి

లంచాలకు తావులేని వ్యవస్థలో భాగంగానే సరికొత్త విధానాలు

జనవరి 30 వరకూ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ పొడిగింపు 

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పేదల కోసం కొత్తగా నిర్మించనున్న వైఎస్సార్‌ జగనన్న కాలనీలను కూడా సమగ్ర భూ సర్వేలో చేర్చాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. మ్యాపుల తయారీలో ఈ కాలనీలను పరిగణనలోకి తీసుకోవాలని, ప్రతి ఇంటికీ యూనిక్‌ ఐడీ నంబరు ఇవ్వాలని సూచించారు. ఒక గ్రామంలో సమగ్ర భూ సర్వే పూర్తయిన తర్వాత సంబంధిత గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభం కావాలని స్పష్టం చేశారు. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై  ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

సమగ్ర భూ సర్వే ప్రక్రియకు సంబంధించి సర్వేయర్‌ నుంచి జేసీ వరకూ స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌ (ఎస్‌ఓపీ) లు ఉండాలని, వారు కచ్చితంగా బాధ్యత వహించాలన్నారు. మొబైల్‌ ట్రిబ్యునల్స్‌పై ఎస్‌ఓపీలను రూపొందించాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమర్ధత పెంపొందించేందుకు శిక్షణ, పరీక్షలు నిర్వహించాలన్నారు. లంచాలకు తావులేని వ్యవస్థను తెచ్చే ప్రయత్నంలో భాగంగానే సరికొత్త విధానాలని తెలిపారు. సచివాలయ సిబ్బంది సర్వేలో పాల్గొంటున్న సమయంలో రోజూ కనీసం 2 గంటల పాటు ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 30వ తేదీ వరకూ  పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. 

పరీక్షలతో మెరుగైన పనితీరు..
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు సంబంధిత అంశాల్లో పరిజ్ఞానం, సమర్థత పెంచేందుకు క్రమం తప్పకుండా అవగాహన కార్యక్రమాలు, శిక్షణ, పరీక్షలు నిర్వహించాల్సిందిగా సీఎం సూచించారు. పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యే వరకూ శిక్షణ ఇవ్వడం వల్ల పనితీరులో సమర్థత పెరిగి ప్రజా సమస్యల పరిష్కారంలో మెరుగైన ప్రతిభ కనపరుస్తారన్నారు. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కార్యాచరణను అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో పనితీరును గ్రామ సచివాలయాల సిబ్బంది స్వయంగా పరిశీలించి నేర్చుకునేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం కాగానే సిబ్బంది సందేహాల నివృత్తికి నిపుణులు, సీనియర్‌ అధికారులతో కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. 
అధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

30 వరకూ ఇళ్ల పట్టాల పంపిణీ పొడిగింపు.. 
పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. ప్రతి లబ్ధిదారుడికి నేరుగా పట్టా పత్రం అందిస్తున్నామని, ఇంటి స్థలం ఎక్కడుందో చూపిస్తున్నామని దీనికి కొంత సమయం పడుతోందని అధికారులు వివరించారు. లబ్ధిదారులకు సంతృప్తి కలిగేలా కార్యక్రమం కొనసాగాలని, ఇళ్ల పట్టాల పంపిణీని జవనరి నెలాఖరు వరకూ పొడిగించాలని సీఎం సూచించారు. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ నిరంతర ప్రక్రియని, అర్హులైన వారికి  దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోగా పట్టా ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని సీఎం పేర్కొన్నారు. ఈ విధానం సమర్థంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

దఫాలుగా సర్వే సిబ్బందికి శిక్షణ
సమగ్ర సర్వేలో పాల్గొంటున్న సిబ్బందికి దఫాలుగా శిక్షణ ఇస్తున్నామని, రెండో స్థాయిలో 92 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని అధికారులు వివరించారు. మిగిలినవారికి అవగాహన కల్పించేలా, పరిజ్ఞానం పెంచేలా శిక్షణ ఇస్తున్నామని, ఫిబ్రవరిలో మూడో స్థాయి పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. సీఎం సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్, సీఎం ముఖ్య సలహాదారు నీలం సాహ్ని, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, రెవెన్యూశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ ఎం.గిరిజా శంకర్, సర్వే, సెటిల్‌మెంట్స్‌ అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ కమిషనర్‌ సిద్దార్ధ జైన్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top