‘జోన్‌’ పట్టాలెక్కించండి

YSR Congress Party MPs Request To Ashwini Vaishnav - Sakshi

వాల్తేరు డివిజన్‌ను విశాఖ కేంద్రంగా కొనసాగించాలి

రైల్వే మంత్రితో భేటీలో వైఎస్సార్‌సీపీ ఎంపీల విజ్ఞప్తి 

సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కార్యకలాపాలను త్వరితగతిన ప్రారంభించాలని వైఎస్సార్‌ సీపీ ఎంపీలు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు విజ్ఞప్తి చేశారు. గురువారం పార్లమెంట్‌లోని రైల్వే మంత్రి కార్యాలయంలో వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి నేతృత్వంలో పార్టీ ఎంపీలు కేంద్రమంత్రితో సమావేశమయ్యారు. ఎంపీల బృందంలో పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, మార్గాని భరత్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, బీవీ సత్యవతి, గొడ్డేటి మాధవి, చింతా అనూరాధ ఉన్నారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల అమలు వేగవంతం చేయాలని కోరుతూ ఈ సందర్భంగా వినతిపత్రం అందజేశారు. 

► ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించి రెండేళ్లు దాటినా ఇప్పటికీ జోన్‌ కార్యకలాపాలు ప్రారంభం కాలేదు. ఆంధ్రప్రదేశ్‌ మొత్తానికి విస్తరించే దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కార్యకలాపాలను ప్రారంభిస్తే ఏటా రమారమి రూ.13వేల కోట్ల ఆదాయంతో దేశంలోనే అత్యధిక లాభసాటి జోన్‌గా రాణిస్తుంది. 
► రైల్వేలో అత్యధిక ఆదాయం వచ్చే డివిజన్లలో విశాఖపట్నం కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్‌ కీలకం. దేశంలోని కొన్ని రైల్వే జోన్ల కంటే కూడా వాల్తేరు డివిజన్‌ అత్యధిక ఆదాయం ఆర్జిస్తోంది. నానాటికీ పురోగమిస్తున్న వాల్తేరు డివిజన్‌ను రద్దు చేసి విశాఖపట్నం నగరాన్ని విజయవాడ డివిజన్‌ కిందకు తీసుకురావాలన్న ఆలోచన ఘోర తప్పిదం అవుతుంది. వాల్తేరు డివిజన్‌లో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. వాల్తేరు డివిజన్‌ను విశాఖలో కొనసాగించడం వల రైల్వే అదనంగా ఎలాంటి ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. 
► విశాఖ –అరకు మధ్య నడిచే రైలుకు అదనంగా 5 విస్టాడోమ్‌ కోచ్‌లను కేటాయించాలి.
► చిత్తూరు జిల్లా మన్నవరంలో ఉన్న ఎన్‌టీపీసీ–బీహెచ్‌ఈఎల్‌ ఆవరణలో కంటైనర్‌ తయారీ విభాగాన్ని నెలకొల్పాలి
► రాష్ట్రానికి చెందిన ఉద్యోగార్ధులు ఆర్‌ఆర్‌బీ పరీక్షలు రాసేందుకు సికింద్రాబాద్‌ లేదా భువనేశ్వర్‌కు వెళ్లాల్సి వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి.
► నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే లైను నిర్మాణాన్ని వేగవంతం చేయాలి. కర్నూలులో కోచ్‌ వర్క్‌షాప్‌ నెలకొల్పాలి. విజయవాడ–విశాఖపట్నం మధ్య మూడో రైల్వే లైన్‌ నిర్మాణం చేపట్టాలి. తిరుపతి–పాకాల–చిత్తూరు–కాట్పాడి మధ్య డబుల్‌ లైన్‌ నిర్మాణం చేపట్టాలి. 
► విజయవాడ రాజరాజేశ్వరిపేటలోని రైల్వే భూముల్లో మూడు దశాబ్దాలకు పైగా నివాసం ఉంటున్న 800 నిరుపేద కుటుంబాలు ఇళ్ల క్రమబద్ధీకరణకు సహకరించాలి. ఆ భూమికి బదులు గా అజిత్‌సింగ్‌నగర్‌ రైల్వే స్థలానికి సమీపంలోనే ఉన్న 25 ఎకరాల భూమిని రైల్వే శాఖకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top