సీఎం జగన్‌ విజయనగరం, విశాఖ జిల్లాల పర్యటన.. పూర్తి షెడ్యూల్‌ ఇదే..

Ys Jagan Vizianagaram And Vizag Tour Schedule On May 3rd - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చే నెల 3న విజయనగరం, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి శంకుస్ధాపన, చింతపల్లి ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ నిర్మాణం, తారకరామతీర్ధ సాగర్‌ ప్రాజెక్ట్‌ మిగులు పనులకు శ్రీకారం చుట్టనున్నారు. విశాఖపట్నం-మధురవాడలో వైజాగ్‌ ఐటీ టెక్‌ పార్క్‌కు శంకుస్థాపన చేయనున్నారు. 

విజయనగరం జిల్లా షెడ్యూల్‌
ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు భోగాపురం మండలం ఎ.రావివలస గ్రామం వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. 10.25 గంటలకు జీఎంఆర్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌కు చేరుకుంటారు. ఆ సెంటర్‌ను సందర్శిస్తారు. భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి శంకుస్ధాపన చేస్తారు.
చదవండి: ఇంటింటా ‘నమ్మకం’.. జగనన్నే మా భవిష్యత్తు.. 1.1 కోట్ల మిస్డ్ కాల్స్‌

10.30 గంటలకు భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం, చింతపల్లి ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ నిర్మాణం, తారకరామతీర్ధ సాగర్‌ ప్రాజెక్ట్‌ మిగులు పనులకు సంబంధించిన శిలా ఫలకాలను ఆవిష్కరిస్తారు. 10.55 గంటలకు సవరవిల్లి వద్ద ఏర్పాటుచేసిన బహిరంగసభ వేదిక వద్దకు చేరుకుంటారు. సభ అనంతరం 1.20 గంటలకు అక్కడి నుంచి విశాఖ పర్యటనకు బయలుదేరుతారు. 

విశాఖపట్నం పర్యటన
మధ్యాహ్నం 1.40 గంటలకు విశాఖ మధురవాడ ఐటీ హిల్స్‌ నెంబర్‌ 3 వద్ద గల హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. రోడ్డు మార్గంలో బయలుదేరి ఐటీ హిల్స్‌ నెంబర్‌ 4లో గల వేదిక వద్దకు 2 గంటలకు చేరుకుంటారు. 2.30–3.00 వైజాగ్‌ ఐటీ టెక్‌ పార్క్‌ శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ సందర్శిస్తారు, అనంతరం పారిశ్రామికవేత్తలతో నిర్వహించే కార్యక్రమంలో సీఎం ప్రసంగిస్తారు.

తర్వాత 3.50 గంటలకు అక్కడినుంచి బయలుదేరి రుషికొండలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసానికి చేరుకుంటారు. అక్కడ ఇటీవల వివాహం చేసుకున్న ఎంపీ కుమారుడు దంపతులను ఆశీర్వదిస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు మధురవాడ హెలిప్యాడ్‌ నుంచి బయలుదేరి, 5.20 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. సాయంత్రం 5.30 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 6.45 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
చదవండి: జగజ్జనని చిట్‌ ఫండ్స్‌.. ఆదిరెడ్డి అప్పారావు, వాసు అరెస్ట్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top