‘కోవిడ్‌’ కారుణ్య నియామకాలు

YS Jagan Mandate Officials Government Jobs for families of government employees who died with Covid - Sakshi

మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబీకులకు వెంటనే ఉద్యోగాలు

వచ్చే నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి కావాలని సీఎం జగన్‌ ఆదేశం

176 కొత్త పీహెచ్‌సీల నిర్మాణంపై దృష్టి.. జనవరిలో పనులు

సాక్షి, అమరావతి: కోవిడ్‌తో మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబీకులకు కారుణ్య నియామకాల కింద వెంటనే ఉద్యోగాలు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. నవంబర్‌ 30 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కోవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్, ఆస్పత్రుల్లో సిబ్బంది నియామకాలు, కొత్త పీహెచ్‌సీల నిర్మాణం, హెల్త్‌హబ్స్‌పై ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 176 కొత్త పీహెచ్‌సీల నిర్మాణంపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. జనవరిలో వీటి పనులు ప్రారంభించి 9 నెలల్లోగా పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. జాతీయ ప్రమాణాలను అనుసరించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది నియామకాలు ఉండాలని, ఇందులో రాజీకి ఆస్కారం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

పోస్టుల భర్తీకి రేపు నోటిఫికేషన్లు
వివిధ ఆస్పత్రుల్లో గుర్తించిన ఖాళీలు, అవసరాల మేరకు నియామకాల క్యాలెండర్‌ రూపొందించినట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్‌ 20న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. డీపీహెచ్‌ఎఫ్‌డబ్ల్యూలో పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి డిసెంబర్‌ 10న నియామక ఉత్తర్వులు ఇస్తామని చెప్పారు. డీఎంఈలో పోస్టులకు డిసెంబర్‌ 5న నియామక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఏపీవీవీపీలో పోస్టులకు అక్టోబరు 20 నుంచి 23 వరకూ నోటిఫికేషన్లు జారీ చేసి డిసెంబర్‌ 21 – 25 మధ్య నియామక ఉత్తర్వులు ఇస్తామని అధికారులు పేర్కొన్నారు.

సమీక్షలో ఉపముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌(నాని), సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌శర్మ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్‌ఆర్‌) శశిభూషణ్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజ్‌మెంట్, వ్యాక్సినేషన్‌) ఎం.రవిచంద్ర, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ ఎం.టి.కృష్ణబాబు, 104 కాల్‌సెంటర్‌ ఇన్‌చార్జ్‌ ఎ.బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈవో వి.వినయ్‌చంద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి.మురళీధర్‌రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్‌ డాక్టర్‌ వి. వినోద్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

రాష్ట్రంలో కోవిడ్‌ ఇలా..
► 12,833 సచివాలయాల పరిధిలో సున్నా కేసులు నమోదు
► యాక్టివ్‌ కేసులు 6,034
► రికవరీ రేటు 99.01% n పాజిటివిటీ రేటు 1.36 %
► 0 నుంచి 3 లోపు పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలు 12
► 3 నుంచి 5 లోపు పాజిటివిటీ రేటు ఉన్న  జిల్లా 1
► నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్న బెడ్స్‌ 91.28 %
► ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్న బెడ్స్‌ 69.62%
► 104 కాల్‌ సెంటర్‌కు సగటున వచ్చిన కాల్స్‌ 500
► ఆక్సిజన్‌ డీ టైప్‌ సిలిండర్లు 27,311, కాన్సన్‌ట్రేటర్లు 27,311 అందుబాటులో
► రాష్ట్రవ్యాప్తంగా 140 ఆక్సిజన్‌ జనరేషన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్ల ఏర్పాటుకు చురుగ్గా పనులు
► అక్టోబర్‌ నెలాఖరు నాటికి అందుబాటులోకి రానున్న పీఎస్‌ఏ ప్లాంట్లు
► ఇప్పటివరకు తొలి డోసు టీకాలు తీసుకున్న వారి సంఖ్య 1,33,80,259
► రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూరైన వారు 1,66,58,195 n వ్యాక్సినేషన్‌కు వినియోగించిన మొత్తం డోసులు 4,66,96,649  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top