మానవత్వం, నైతికతపై మీరా మాట్లాడేది?: వైఎస్‌ జగన్‌ | YS Jagan Fire On CM Chandrababu Over Singayya Incident During His Palnadu Visit, More Details Inside | Sakshi
Sakshi News home page

మానవత్వం, నైతికతపై మీరా మాట్లాడేది?: వైఎస్‌ జగన్‌

Jun 24 2025 3:28 AM | Updated on Jun 24 2025 3:31 PM

YS Jagan Fire On CM Chandrababu Over Singaiah Incident

సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్‌ జగన్‌

మీ పైలట్‌ వెహికల్స్, సెక్యూరిటీ, రోప్‌ పార్టీలు.. ఇవన్నీ జడ్‌ప్లస్‌ సెక్యూరిటీ ఉన్న మాజీ సీఎం వాహనం చుట్టూ, ఇంతమంది ప్రజల తాకిడి ఉన్నప్పుడు ఎందుకు లేవు? 

ఒకవేళ ఉండి ఉన్నమాట నిజమే అయితే ఎవరైనా వెహికల్‌ కింద ఎలా  పడగలుగుతారు?  

ఏది వాస్తవం? మీరు సెక్యూరిటీ ఇవ్వలేదన్నదా? లేక వెహికల్‌ కింద ఎవరూ పడలేదన్నదా?  

ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం పట్ల చేతనైనంత మేర మా బాధ్యతను నిర్వర్తించాం 

గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ ఇదే రీతిలో స్పందించాం  

అయినా కూడా మా మీద విష ప్రచారాలు చేస్తున్నారు  

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ కార్యకర్త సింగయ్య మృతిపై విష ప్రచారంతో టీడీపీ, ఎల్లో బ్యాచ్‌ చేస్తున్న క్షుద్ర రాజకీయాలను ‘ఎక్స్‌’ వేదికగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడిగిపారేశారు. ‘‘ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం పట్ల చేతనైనంత మేర మా బాధ్యతను నిర్వర్తించాం. అందులోనూ మరణించిన ఆ వ్యక్తి మా మనిషి, మమ్మల్ని అభిమానించే వ్యక్తి అయినప్పుడు ఆ బాధ్యత మరింత రెట్టింపు అవుతుంది.

ఇదే పర్యటనలో గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ ఇదే రీతిలో స్పందించాం. అయినా కూడా మా మీద విష ప్రచారాలు చేస్తున్నారు. మానవత్వం, నైతికత గురించి మీరు పాఠాలు చెప్పడం ఆశ్చర్యకరం..’ అని ధ్వజమెత్తారు. ‘మీ పర్యటనల సమయంలో.. మీ మీటింగుల్లో చనిపోయిన వారి విషయంలో మీరు ఏం చేశారు? ఎంత చేశారు? ఎంత మేర చేశారు? మానవత్వం, నైతికత గురించి మీరా మాట్లాడేది?..’ అని సీఎం చంద్రబాబును సూటిగా నిలదీశారు. ఇప్పటికైనా మారండి..! అని హితవు పలుకుతూ సోమవారం తన ‘ఎక్స్‌’ ఖాతాలో వైఎస్‌ జగన్‌ పోస్టు చేశారు.

అందులో ఏమన్నారంటే..  చంద్రబాబూ..! ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు. నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి, ఎవరూ రాకూడదని కట్టడి చేశారు? గతంలో మీరుగానీ, మీ పవన్‌కళ్యాణ్‌గానీ తిరుగుతున్నప్పుడు మేం ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా? ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తల ఇంటికి వెళ్లడం తప్పా? ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరఫున, ప్రజల తరఫున వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్లడం తప్పా?

ఒక మాజీ ముఖ్యమంత్రిగా, జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ భద్రత అన్నది నాకు అయినా.. మీకు గతంలో అయినా, భవిష్యత్తులో అయినా ఆటోమేటిక్‌ హక్కు కాదా? మాకు బుద్ధి పుట్టినప్పుడు భద్రత ఇస్తాం..! లేదంటే మూడ్‌ రానప్పుడు మీకు జెడ్‌ ప్లస్‌ కేటగిరీ సెక్యూరిటీని విత్‌డ్రా చేసుకుంటామనే అధికారం ఏ ప్రభుత్వాని కైనా ఉంటుందా? అది మీకైనా, నాకైనా!! జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఆ కార్యక్రమంపై తన కార్యాలయం ద్వారా ముందుగానే సమాచారం ఇస్తారు. అలా సమాచారం ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వంలో పోలీసులు అయినా జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ప్రొటోకాల్‌ అనుసరించి ఆమేరకు ఆ మాజీ ముఖ్యమంత్రికి సెక్యూరిటీ కల్పించాలి. ఇది నాకైనా, మీకైనా ఒకటే. ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉన్నా పాటించాల్సిన ప్రొటోకాల్‌ ఇది.

మరి జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీతో ఉన్న మాజీ ముఖ్యమంత్రి తన ప్రోగ్రామ్‌కు సంబంధించిన రూట్‌మ్యాప్‌ ఇచ్చిన తర్వాత.. పైలట్‌ వెహికల్స్, రోప్‌ పార్టీలు అన్నవి సెక్యూరిటీ ప్రొటోకాల్‌లో భాగమైనప్పుడు.. మరి మీ రోప్‌ పార్టీలకు జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న వాహనం చుట్టూ రోప్‌ పట్టుకుని, ఎవరూ వాహనం మీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండదా? మనుషుల తాకిడి ఎక్కువగా ఉన్న పరిస్థితుల మధ్య! అందుకే కదా.. జెడ్‌ ప్లస్‌ కేటగిరీ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ప్రయాణంలో, ప్రొటోకాల్‌లో భాగంగా ఈ రోప్‌ పార్టీని, పైలట్‌ వాహనాలను పెట్టడానికి కారణం.  

మరి మీ పైలట్‌ వెహికల్స్, అందులో సెక్యూరిటీ, రోప్‌ పార్టీలు.. జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ, ఇంతమంది ప్రజల తాకిడి ఉన్నప్పుడు ఎందుకు లేవు? ఒకవేళ ఉండి ఉన్నమాట నిజమే అయితే ఎవరైనా వెహికల్‌ కింద ఎలా  పడగలుగుతారు? మరి ఏది వాస్తవం? మీరు సెక్యూరిటీ ఇవ్వలేదన్నదా లేక వెహికల్‌ కింద ఎవరూ పడలేదన్నదా?  

⇒  జెడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రికి బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని కూడా గవర్నమెంటే ఇవ్వాలి. గవర్నమెంట్‌ డ్రైవరే ఆ వాహనాన్ని డ్రైవ్‌ కూడా చేయాలి. ఇది ప్రొటోకాల్‌. మంచి బుల్లెట్‌ ప్రూఫ్‌ వెహికల్‌ మీరు ప్రొవైడ్‌ చేయకపోవడంతో గవర్నమెంటు అనుమతితో నేనే నా సొంత డబ్బుతో సొంతంగా వాహనాన్ని కొనిపెట్టా. డ్రైవర్‌ను మీరు (గవర్నమెంటు) ప్రొటోకాల్‌ ప్రకారం ఇచ్చారు. మరి మీ గవర్నమెంటు డ్రైవర్‌ తోలుతున్న ఈ వెహికల్, మీరు ఇచ్చిన పైలట్‌ వెహికల్స్, మీ రోప్‌ పార్టీల ఆధ్వర్యంలో ప్రయాణం జరుగుతున్నప్పుడు.. మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న వాహనం సెక్యూరిటీ బాధ్యత మీది కాదా? 
అందుకే కదా ఈ ప్రొటోకాల్‌.  

⇒ ఆ రోజు మీ ఎస్పీ ఈ ఘటన మీద ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఏమిటి? మరి ఎందుకు ఈ టాపిక్‌ డైవర్షన్‌ రాజకీయాలు?

⇒   ప్రతిపక్షంగా ఉన్నందున నేను ప్రెస్‌మీట్‌ పెట్టి గతంలో మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, హామీలపై మీరు చెప్పిన మాటలు, గతంలో మీరు ఇంటింటికీ పంపించిన బాండ్లను, మీ మేనిఫెస్టో, మీ అబద్ధాలను, మీ మోసాలను బయటపెడితే.. మీ పాలనా వైఫల్యాలను, రెడ్‌బుక్‌ రాజ్యాంగం పేరుతో మీరు చేస్తున్న భయంకర పాలన గురించి ఎక్స్‌పోజ్‌ చేస్తే... రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి, తద్వారా ఖజానాకు మీ వల్ల జరిగిన నష్టాన్ని, అతలాకుతలమవుతున్న రైతులు, అక్కచెల్లెమ్మలు, పిల్లల బతుకులు..  వీటన్నింటినీ నేను చెబితే... వాటికి సమాధానం చెప్పలేక, ప్రజల్లో మీ మీద ఉన్న వ్యతిరేకత, నామీద ప్రేమను చూసి తట్టుకోలేక, మీరు డైవర్షన్‌ రాజకీయాలు మరింత దిగజారి చేయడం అత్యంత హేయకరం. కాస్తైనా సిగ్గు తెచ్చుకుని మారండి.  

⇒ ఒక్కటి మాత్రం నిజం. నేను సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామానికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు.. దురదృష్టకర ఘటన జరిగిందని మా పార్టీ నాయకులు నా దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే మా పార్టీ ప్రత్తిపాడు ఇన్‌ఛార్జి బాలసాని కిరణ్, తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా అప్పటికే మా పార్టీ నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారని మావాళ్లు చెప్పారు. వెంటనే నేను స్పందించి మరుసటి రోజు కూడా ఆ కుటుంబం దగ్గరకు వెళ్లాలని, కష్టంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, రూ.10 లక్షలు ఆరి్థక సహాయం చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చా.

ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం పట్ల చేతనైనంత మేర మా బాధ్యతను మేం నిర్వర్తించాం. అందులోనూ మరణించిన ఆ వ్యక్తి మా మనిషి, మమ్మల్ని అభిమానించే వ్యక్తి అయినప్పుడు ఆ బాధ్యత మరింత రెట్టింపు అవుతుంది. ఇదే పర్యటనలో గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ ఇదే రీతిలో స్పందించాం. అయినా కూడా మామీద విషప్రచారాలు చేస్తున్నారు. మానవత్వం గురించి, నైతికత గురించి మీరు పాఠాలు చెప్పడమే ఆశ్చర్యం! 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement