
సాక్షి, గుంటూరు: ప్రముఖ మత ప్రబోధకుడు, పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత బాధాకరమన్న ఆయన.. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మరోవైపు ప్రవీణ్ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు.
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు కొంతమూరు వద్ద రోడ్డు ప్రమాదంలో పాస్టర్ పగడాల ప్రవీణ్‌కుమార్ మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రవీణ్‌కుమార్ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ క్రైస్తవ సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించాలని.. అన్ని కోణాల్లో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు వాళ్లు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు కొంతమూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బుల్లెట్‌పై సోమవారం రాజమహేంద్రవరం బయలుదేరిన ప్రవీణ్‌కుమార్ అర్ధరాత్రి సమయంలో కొంతమూరు వద్ద ప్రమాదానికి గురయ్యారు. మంగళవారం ఉదయం దాకా ఆయన అలా పడి ఉండడం ఎవరూ గమనించకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి: పాస్టర్ ప్రవీణ్ ఒంటిపై గాయాలు!