
లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఘటన
తాడేపల్లి రూరల్: అప్పటిదాక జ్యూస్ షాప్ నడిపి... భార్యతో కారులో ఇంటికి వెళ్తున్న యువకుడిని ఐదుగురు వ్యక్తులు అడ్డుకుని తీసుకెళ్లిన ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి స్టేషన్ పరిధి ప్రాతూరు రోడ్డులో జరిగింది. యువకుడి భార్య లక్ష్మీప్రసన్న తెలిపిన వివరాల ప్రకారం... తాడేపల్లి బైపాస్ సర్వీస్ రోడ్డులో కె.స్రవంత్‌రెడ్డి జ్యూస్ షాప్ నడుపుతున్నాడు. సోమవారం సాయంత్రం స్నేహితుడి కారులో ప్రాతూరులోని ఇంటికి వెళ్తుండగా కుంచనపల్లి దాటాక ఓ కారు వచ్చి అడ్డగించింది. తొలుత ఇద్దరు, తర్వాత ముగ్గురు కిందకు దిగారు.
తాము పోలీసులమని, యాక్సిడెంట్ కేసులో నీ భర్తను విచారించడానికి తాడేపల్లి తీసుకెళ్తున్నామని చెప్పారు. కానీ, ప్రాతూరు వైపు వెళ్తుండడంతో లక్ష్మీప్రసన్న అనుమానించింది. తమ కారులో ఉన్న వ్యక్తిని ప్రశ్నించగా అతను సమాధానం చెప్పలేదు. వాహనాన్ని తిప్పుకొని తాడేపల్లి బైపాస్ వైపు వెళ్లాడు. స్రవంత్‌రెడ్డిని ఒకవైపు, తాము ప్రయాణిస్తున్న కారును తాడేపల్లి వైపు తీసుకువెళ్లారు.
రూటు మార్చడంతో... 100కు డయల్ చేసినా స్పందన రాలేదని, సంఘటనపై తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశామని లక్ష్మీప్రసన్న తెలిపింది. కాగా, ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన తాడేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. ఎస్‌ఐ ప్రతాప్ సిబ్బందితో కలిసి సీసీ కెమెరాలను పరిశీలించారు. స్రవంత్‌రెడ్డిని తీసుకెళ్లింది పోలీసులే అయి ఉంటారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, స్రవంత్‌కు ఎవరితోనూ గొడవల్లేవని, కేసులు లేవని పోలీసులు ఎందుకు తీసుకెళ్తారని బంధువులు వ్యాఖ్యానిస్తున్నారు.