తెల్లారితే భార్య సీమంతం.. అంతలోనే | Young man ends life in Visakhapatnam | Sakshi
Sakshi News home page

తెల్లారితే భార్య సీమంతం.. అంతలోనే

Jul 3 2026 8:26 AM | Updated on Jul 3 2026 10:51 AM

Young man ends life in Visakhapatnam

విశాఖపట్నం: మరుసటి రోజు భార్య సీమంతం. ఇంటిల్లిపాదీ ఆనందంగా బంధువులను ఆహ్వానిస్తూ శుభకార్యానికి ఏర్పాట్లు చేస్తోంది. కానీ ఆ ఆనందం ఒక్క క్షణంలోనే విషాదంగా మారింది. పాత పరిచయస్తులను ఆహ్వానించేందుకు వెళ్లిన యువకుడు, స్నేహితులతో జరిగిన చిన్నపాటి వాగ్వాదంలో ప్రాణాలు కోల్పోయాడు. తాటిచెట్లపాలెం సంజీవయ్యకాలనీలో గురువారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. 

కంచరపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఊర్వశి కూడలికి చెందిన బోరా మణికంఠ (26) కుటుంబం గతంలో సంజీవయ్యకాలనీలో నివసించేది. ప్రస్తుతం వేరే ప్రాంతంలో ఉంటున్నప్పటికీ, మణికంఠ భార్యకు శుక్రవారం సీమంతం జరగనున్న నేపథ్యంలో అతని తల్లి పాత పరిచయస్తులను ఆహ్వానించేందుకు సంజీవయ్యకాలనీకి వెళ్లింది. అనంతరం మణికంఠను కూడా అక్కడికి రమ్మని ఫోన్‌ చేయడంతో అతడు అక్కడికి చేరుకున్నాడు.

 అక్కడ స్నేహితులతో మాట్లాడుతుండగా ఏదో విషయంపై మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. పాత కక్షల నేపథ్యంలో ఆవేశానికి లోనైన సురేంద్ర అలియాస్‌ కన్నా మణికంఠపై పిడిగుద్దులతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మణికంఠ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న కంచరపాలెం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కోరాడ రామారావు సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్‌ టీం, ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌ బృందాలు ఆధారాలు సేకరించాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు 
‘తెల్లారితే ఇంట్లో పెద్ద పండగ.. అందరికీ బొట్టు పెట్టి పిలిచాం.. ఇంతలోనే నా కొడుకు శవమైపోతాడని అనుకోలేదు’ అంటూ మణికంఠ తల్లి, బంధువులు రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. గర్భవతి అయిన భార్య తన భర్త ఇక లేడనే నిజాన్ని నమ్మలేక స్పృహతప్పి పడిపోయింది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement