‘చేయూత, ఆసరా’ లబ్ధితో వ్యాపారవేత్తలుగా మహిళలు

Women Benefited From The Support Schemes Started New Business - Sakshi

ఒక్క రోజే 2,719 వ్యాపారాలు కొత్తగా ప్రారంభం

ఘనంగా ముగిసిన వైఎస్సార్‌ ఆసరా వారోత్సవాలు

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా పథకాల ద్వారా ప్రభుత్వం చేకూర్చిన లబ్ధితో పేదింటి మహిళల ఆధ్వర్యంలో గురువారం ఒక్క రోజునే 2,719 చోట్ల కొత్తగా వివిధ రకాల వ్యాపార దుకాణాలకు ప్రారంభోత్సవాలు జరిగాయి. వైఎస్సార్‌ ఆసరా వారోత్సవాల ముగింపు సందర్భంగా పట్టణ ప్రాంతాల్లో 1,756, గ్రామీణ ప్రాంతాల్లో 963 చోట్ల సెర్ప్, మెప్మా ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యేల సమక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు కొత్తగా దుకాణాలు ప్రారంభించారు.

ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట ఉన్న అప్పు మొత్తాన్ని నాలుగు విడతల్లో మహిళల పొదుపు సంఘాల బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేసేందుకు ఉద్ధేశించిన వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని సెప్టెంబరు 11న సీఎం జగన్‌ లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే.
గత ఏడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన వారోత్సవాల్లో 28,328 గ్రామ సమాఖ్యల పరిధిలోని 6.24 లక్షల సంఘాల్లో దాదాపు 65 లక్షల మంది మహిళలు, పట్టణ ప్రాంతాల్లోని 8,650 స్లమ్‌ లెవల్‌ ఫెడరేషన్ల(ఎస్‌ఎల్‌ఎఫ్‌) పరిధిలో 1.53 లక్షల సంఘాలకు చెందిన 18 లక్షల మంది మహిళలు పాల్లొన్నారు.

బతుకుతెరువు చూపించారు..
నాకు చేయూత కింద నాలుగేళ్లలో రూ.75 వేలు ఇస్తామని జగనన్న చెప్పినారు. ఇపుడు రూ.18,750 ఇచ్చినారు. మెప్మా సార్‌ వాళ్లు బ్యాంకులో మాట్లాడి రూ.56,250 లోను ఇప్పించినారు. అంగట్లో చిన్నా చితకా వస్తువులు పెట్టుకున్నా. మార్కెట్‌లో దొరికే రేట్ల కంటే తక్కువకే మాకు సరుకులు ఇచ్చేలా మునిసిపల్‌ ఆఫీసర్లు కంపెనీ వాళ్లతో మాట్లాడి సాయం చేసినారు. అంగడికాడికే వచ్చి సరుకులు ఇచ్చిపోతా ఉండారు. బ్యాంకులోను 36 నెలల్లో కట్టేస్తే అప్పు తీరిపోతాది. ఇంకా మూడేళ్లకు నాకు జగనన్న రూ.56,250 ఇస్తారు. మా కుటుంబానికి బతుకుదెరువు చూపించినారు. ఈ మేలు ఎన్నడూ మర్చిపోను. 
– ఇంద్రాణి, చిత్తూరు

నా కుటుంబానికి నిజంగా చేయూతే
వైఎస్సార్‌ ఆసరా సాయంగా నాకు రూ.18,750 అందాయి. వెలుగు అధికారుల ద్వారా మరో రూ.50 వేల రుణం వచ్చింది. ఈ మొత్తంతో రావికమతంలో కిరాణా దుకాణం పెట్టాను. నా భర్త, పెద్ద కుమారుడు వ్యవసాయం చేస్తారు. చిన్న కుమారుడు ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. కిరాణా దుకాణం ద్వారా వచ్చే ఆదాయం నా కుమారుడి చదువుకు, కుటుంబ పోషణకు ఉపయోగపడుతుంది.
– కంచిపాటి లక్ష్మి,  శ్రీ బాబా డ్వాక్రా సంఘం, రావికమతం, విశాఖ జిల్లా

నా లాంటి పేదరాలికి కొండంత చేయూత
నేను ఝాన్సీ పొదుపు సంఘంలో సభ్యురాలిని. వైఎస్సార్‌ చేయూత ద్వారా రూ.18,750లు వచ్చాయి. వైఎస్సార్‌ ఆసరా కింద మా సంఘానికి  మొదటి విడత రూ.లక్ష రుణమాఫీ అయింది. జగనన్న ఇచ్చిన చేయూత సాయానికి తోడుగా బ్యాంకు ద్వారా రూ.56,250లు రుణం మంజూరు అయింది. ఈ నగదుతో కిరాణాషాపు పెట్టుకున్నా. నా లాంటి పేదలకు ఎలాంటి హామీ లేకుండా రుణం ఇప్పించి మా కాళ్లపై మేము నిలబడేందుకు సహాయపడిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటా.
 – ముల్లంగి శ్యామల, పోలవరం, చాట్రాయి మండలం, కృష్ణా జిల్లా

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top