
భర్తపై భార్య హత్యాయత్నం
నదిలో బండరాయి పట్టుకొని ప్రాణం కాపాడుకున్న భర్త
కృష్ణానది గుర్జాపూర్ బ్రిడ్జిపై ఘటన
కృష్ణా: కొత్తగా పెళ్లయిన జంట.. బైక్‌పై వెళ్తూ మాంచి లొకేషన్ కనిపిస్తే ఫొటోలు తీసుకోవాలని ముచ్చటపడ్డారు. వారు వెళ్తున్న దారిలో కృష్ణానదిపై గుర్జాపూర్ బ్రిడ్జి వచి్చంది. అదే మంచి స్పాట్ అనుకొని ఫొటోలు దిగటానికి సిద్ధమయ్యారు. భర్త తన భార్యకు ఫోన్ ఇచ్చి.. తనను ఫొటోలు తీయాలని కోరి వెళ్లి బ్రిడ్జి అంచున నిలబడ్డాడు. భార్య కూడా ఫొటోలు తీస్తూనే భర్త వద్దకు వెళ్లి ఒక్కసారిగా అతన్ని నదిలోకి తోసేసింది.
బిక్కచచ్చిపోయారు భర్త నీళ్లలో పడి కొట్టుకుపోతూ.. నదిలో ఓ రాయిని పట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నాడు. అతడి కేకలు విని జాలర్లు రక్షించి పైకి తీసుకొచ్చారు. అయితే, భార్యే తనను నదిలోకి తోసిందని భర్త చెబుతుండగా, లేదులేదు.. అతడే నదిలో పడిపోయాడని భార్య వాదిస్తోంది. ఏం చేయాలో తెలియని పోలీసులు తలలు పట్టుకున్నారు. ఈ ఘటన శనివారం తెలంగాణ– కర్ణాటక సరిహద్దులో నారాయణపేట జిల్లాలో ఉన్న గుర్జాపూర్ బ్రిడ్జిపై చోటుచేసుకుంది.
ప్రమాదమా? హత్యాయత్నమా?
కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఉన్న శక్తినగర్‌కు చెందిన తాతప్ప (23)కు యాద్గిర్ జిల్లాలోని వడిగేరి గ్రామానికి చెందిన గెట్టెమ్మ (20)తో మూడు నెలల క్రితం వివాహమైంది. రెండు రోజుల క్రితం ఇద్దరు బైక్‌పై వడిగేరికి వెళ్లి శనివారం ఉదయం తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యలో కృష్ణానదిపై ఉన్న గుర్జాపూర్ బ్రిడ్జిపై ఫొటోలు దిగాలని భావించారు. భర్త తన ఫోన్‌ను భార్య చేతికి ఇచ్చి ఫొటో తీయమని చెప్పి ఆయన బ్రిడ్జి చివరన నిలబడ్డాడు. గెట్టెమ్మ ఫొటో తీస్తున్నట్లు నమ్మించి భర్తను నదిలోకి తోసేసింది. తర్వాత భర్త తల్లికి ఫోన్ చేసి తాతప్ప నదిలో పడిపోయాడని చెప్పింది.
నదిలో పడిన తాతప్ప బ్రిడ్జి పక్కనే కొద్ది దూరంలో ఉన్న రాయిపైకి చేరి ‘నన్ను రక్షించండి.. నా భార్య పారిపోకుండా పట్టుకోండి’అంటూ కేకలు వేశాడు. దీంతో సమీపంలో చేపలు పడుతున్న జాలర్లు గమనించి తాతప్పను తాడు సహాయంతో ఒడ్డుకు చేర్చారు. పైకి వచి్చన తాతప్ప.. భార్యే తనను నదిలోకి తోసేసిందని ఆగ్రహం వ్యక్తంచేయగా.. భార్య మాత్రం తాను తోయలేదని, ఆయనే ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడని వాదించింది. ఈ విషయమై శక్తినగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ బస్వరాజ్‌ను వివరణ కోరగా ఘటన జరిగిన విషయం వాస్తవమేనని తెలిపారు. భార్యాభర్తల మధ్య పంచాయితీ ఉందని, వారి కుటుంబ సభ్యులు మాట్లాడుకొని ఆదివారం ఫిర్యాదు ఇస్తామని చెప్పారని వివరించారు.