నిద్రపోతున్న 6 ఏళ్ల కుమార్తె వద్ద మృతదేహాన్ని ఉంచి పరారీ
తూర్పు గోదావరి జిల్లా: భార్యాభర్తల మధ్య మనస్పర్థలు.. మద్యంకు బానిసైన భర్త వేధింపులు ఆఖరికి అతనే యముడై భార్య ప్రాణాలు తీసిన విషాద ఘటన యానాంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం స్ధానిక బళ్లావారివీధిలో నివాసం ఉంటున్న పెమ్మాడి దీనా(26)ను ఆమె భర్త పెమ్మాడి నాని సోమవారం రాత్రి పీక నొక్కి హత్య చేశాడని ఎస్సైలు పునీత్‌రాజ్, శేరు నూకరాజు తెలిపారు. గుత్తెనదీవికి చెందిన పెమ్మాడి నానితో దీనాకు వివాహం అయ్యింది. వీరికి ఆరేళ్ల కుమార్తె ఉంది. అయితే కొన్నాళ్లు కాపురం సజావుగా సాగిన అనంతరం ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి.
యానాం సబ్‌కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. భర్త నాని సరిగా పనికి వెళ్లకుండా, మద్యం తాగుతూ తిరుగుతుండేవాడని దీంతో విరక్తి చెందిన భార్య దీనా నాలుగు నెలల క్రితం యానాంలో బల్లావారివీధిలో గృహం అద్దెకు తీసుకుని విడిగా ఉంటోందన్నారు. ఇంటర్ వరకు చదువుకున్న ఆమె కుటుంబ పోషణకు టైలరింగ్ చేసేంది. ఈ నేపథ్యంలో ఆమె భర్త నాని కొద్ది రోజుల క్రితం దీనా ఉంటున్న ఇంటికి వచ్చి తాను బాగా చూసుకుంటానని, నీవు లేకుండా ఉండలేనని ఆమెను నమ్మించాడు. మళ్లీ మద్యం తాగి వచ్చి భార్యను కొట్టడమే కాక ఆమె పట్ల అనుమానం వ్యక్తం చేసి వేధింపులకు గురి చేసేవాడు.
సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చి భోజనం చేశాడు. అనంతరం తీవ్రంగా కొట్టి పీకనొక్కి చంపేసి అనంతరం ఆమె మృతదేహాన్ని నిద్రపోతున్న ఆరేళ్ల పాప వద్ద ఉంచి అతను పరారయ్యాడు. మంగళవారం ఉదయాన్నే నిద్ర లేచిన పాప పక్కనే ఉన్న తల్లి మృతదేహాన్ని చూసి స్థానికులకు తెలపగా వారు యానాం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్పీ వరదరాజన్ ఆదేశాల మేరకు ఎస్సై పుష్పరాజ్ ఆధ్వర్యంలో రెండు బృందాలు నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఎగ్జిక్యూటివ్ మేజి్రస్టేట్‌కు సమాచారం అందించినట్లు తెలిపారు.


