మొదటి భార్యే సూత్రధారి
నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
అంబర్‌పేట: అంబర్‌పేట పరిధిలోని డీడీ కాలనీలో గత నెల 29న జరిగిన కిడ్నాప్ కేసును పోలీసుల ఛేదించారు. బాధితుడి మొదటి భార్యే కిడ్నాప్‌నకు సూత్రధారి అని తేల్చారు. ఈమేరకు మంగళవారం ఈస్ట్‌జోన్ డీసీపీ బాలస్వామి, అడిషనల్ డీసీపీ నర్సయ్య, ఏసీపీ హరిష్‌కుమార్‌లు మీడియాకు వివరాలు వెల్లడించారు. డీడీ కాలనీలో నివాసం ఉండే మంత్రి శ్యామ్‌ను అక్టోబరు 29న కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. దీనిపై శ్యామ్ రెండో భార్య ఫాతిమా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కిడ్నాప్ వ్యవహారం ఇలా...
శ్యామ్‌కు అమెరికాలో మాధవీలత అనే యువతితో వివాహం, అక్కడే విడాకులు జరిగాయి. వీరి మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఇద్దరు నగరానికి విచ్చేసి విడివిడిగా ఉంటున్నారు. శ్యామ్ అలీగా పేరు మార్చుకుని ఫాతమా అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. కాగా ఇటీవల శ్యామ్ బంజారాహిల్స్‌లో తనకు వారసత్వంగా వచి్చన ఆస్తిని సుమారు రూ.20 కోట్లకు విక్రయించాడు. అందులో తనకు వాటా కావాలని మాధవీలత భావించి కిడ్నాప్‌నకు ప్రణాళిక వేసింది. ఈ మేరకు తనకు పరిచయం ఉన్న పటేల్‌నగర్‌కు చెందిన దుర్గావినయ్‌ను సంప్రదించింది. దుర్గా వినయ్ రామ్‌నగర్‌లో నివసించే స్నేహితుడు కట్టా దుర్గాప్రసాద్ అలియాస్ సాయి సాయంతో కిడ్నాప్‌కు పథకం రచించారు. ఈమేరకు మొదట కూకట్‌పల్లికి చెందిన ప్రీతి, మలక్‌పేటకు చెందిన సరితలను బాధితుడు శ్యామ్ నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లోని ఎదురు ఫ్లాట్‌లో అద్దెకు దించి అతని కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు. అనంతరం ఈ నెల 29న కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నారు. విద్యానగర్‌కు చెందిన కాటమోని పురుషోత్తం, పురానాఫూల్‌కు చెందిన సందోలు నరే కుమార్, ఆగాపురాకు చెందిన పవన్‌కుమార్, మంగళ్‌హాట్‌కు చెందిన నారాయణ రిషికేష్, పటేల్‌నగర్‌కు చెందిన పిల్లి వినయ్‌లతో కలిసి శ్యామ్‌ను కిడ్నాప్ చేశారు.
పోలీసులకు తెలిసిందని...
శ్యామ్ కిడ్నాప్‌పై పోలీసులకు ఫిర్యాదు అందిందని తెలిసి నిందితులు మొదట కిడ్నాప్‌నకు వినియోగించిన కారును చర్లపల్లిలో వదిలి వేరే వాహనంలో వెళ్లారు. అనంతరం మొదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరిగారు. రూ.30 లక్షలు డిమాండ్ చేయడంతో శ్యామ్ అతని స్నేహితుడు రఘునాథ్‌రెడ్డికి ఫోన్ చేసి డబ్బులు అడగడంతో పాటు కిడ్నాప్ అయినట్లు సమచారం ఇచ్చారు. అప్పటికే పోలీసులు ముమ్మరంగా గాలిస్తుడడంతో కిడ్నాపర్లు విజయవాడకు వెళ్లారు. ఈ విషయాన్ని ఎలా ముగించాలని కిడ్నాపర్లు మాధవీలతను సంప్రదించగా ఆమె సరిగ్గా స్పందించలేదు. దీంతో బాధితుడు తానే డబ్బులు ఇస్తానని కిడ్నాపర్లను నమ్మించి బంజారాహిల్స్‌లోని ఓ బ్యాంకుకు తీసుకువెళ్లాడు. అక్కడ శ్యామ్ కిడ్నాపర్ల నుంచి తప్పించుకుని పోలీసుల చెంతకు చేరి జరిగింది వివరించాడు. దీంతో కిడ్నాపర్లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి మూడు కార్లు, రెండు ద్విచక్రవాహనాలు, 8 సెల్‌ఫోన్లను స్వా«దీనం చేసుకున్నారు.


