జగిత్యాల జిల్లా: జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి మండలం రాజారాంపల్లి వద్ద కిడ్నాప్ కలకలం రేపుతుంది. కన్న కూతురిని కిడ్నాప్ చేయడానికి తల్లిదండ్రులు ప్రయత్నించారు. ఈ ఘటనపై కూతురు వెల్గటూర్ పోలీస్ స్టేషన్లో కన్న తల్లిదండ్రులపై ఫిర్యాదు చేసింది. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పాలకుర్తి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి ప్రియాంక.. వెల్గటూర్ మండలం రాజక్క పల్లె గ్రామానికి చెందిన మర్రి రాకేష్ గత ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఇక, పెద్దలను ఎదిరించి ఈ ఏడాది జూలై 27న ప్రియాంకా, రాకేష్ వివాహం చేసుకున్నారు.
అయితే, రాకేష్ దళితుడైన కారణంగా ప్రియాంకా తల్లిదండ్రులు ఈ సంబంధాన్ని వ్యతిరేకించారు.. అలాగే, ప్రియాంక కడుపుతో ఉండగా హాస్పిటల్‌లో చూపిస్తామని నమ్మించిన తల్లిదండ్రులు.. హాస్పిటల్‌కి చూపించి తిరుగు ప్రయాణంలో కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో స్థానికుల సహాయంతో ప్రియాంక తప్పించుకుంది. ఈ విషయంపై తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ తల్లిదండ్రులతో తనకు తన భర్త రాకేష్‌కు ప్రాణహాని ఉందని కంప్లైంట్‌లో తెలిపింది. ఈ ఘటనపై ప్రియాంకా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.


