గన్‌మెన్‌ ఆత్మహత్యాయత్నంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పంధన | Telangana Hydra Commissioner AV Ranganath Gunman News | Sakshi
Sakshi News home page

గన్‌మెన్‌ ఆత్మహత్యాయత్నంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పంధన

Dec 21 2025 11:55 AM | Updated on Dec 21 2025 1:54 PM

Telangana Hydra Commissioner AV Ranganath Gunman News

సాక్షి, హైదరాబాద్‌: హయత్‌నగర్‌లో గన్‌మెన్‌ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు గన్‌మ్యాన్‌గా పనిచేస్తున్న చైతన్య ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. గన్‌మెన్‌ కృష్ణ చైతన్య ఇంట్లోనే తన వద్ద ఉన్న తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే చైతన్యను ఆస్పత్రిలో చేర్చారు. 

ప్రస్తుతం చైతన్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం మేరకు చైతన్య ఇటీవలే ఓ బెట్టింగ్‌ యాప్‌లో భారీగా డబ్బు పోగొట్టుకున్నట్టు సమాచారం. దాంతో ఏర్పడ్డ ఆర్థిక సమస్యలే ఈ అఘాయిత్యానికి కారణంగా భావిస్తున్నారు.  పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ విషయంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. చైతన్య విషయాన్ని సంచలనం చేయవద్దని మీడియాను కోరుతున్నాను. ఈరోజు ఉదయం ఎల్బీ నగర్ కామినేనిలో కానిస్టేబుల్ చైతన్యను కలిశాను. అతని పరిస్థితి విషమంగా ఉంది. అతను ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దాదాపు 2 సంవత్సరాల క్రితం బెట్టింగ్ యాప్‌లు/గేమింగ్ యాప్‌లలో పాల్గొనడం వల్ల అతను ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు.అప్పుల కారణంగా అతని జీతంలో ఎక్కువ భాగం కట్ అవుతోంది.

ఈరోజు ఉదయం అతను ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతను బతికే ఉన్నాడు. సర్జరీ జరుగుతోంది. బతికే అవకాశాలు మాత్రం చాలా తక్కువ. దాదాపు 3 నెలల క్రితం అతను కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఇంటి నుండి వెళ్లిపోయాడు. దాంతో అప్పుడు హయత్‌నగర్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. అప్పటి నుండి అతను నాడీ సంబంధిత సమస్యలతో (మెదడు గడ్డకట్టడం) బాధపడుతున్నాడు. అయితే అతను విధుల్లో మాత్రం బాగానే ఉన్నాడని రంగనాథ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement