వడివడిగా ఎస్‌ఐఆర్
రెండు దశాబ్దాల వివరాలు సేకరిస్తున్న బీఎల్వోలు 2002 నుంచి 2025 వరకు ఓటరు లిస్టు వడపోత పూర్వీకుల ఆధారాలతో సరిపోలుస్తూ మ్యాపింగ్ వలస, బదిలీ, వివాహితులు, వ్యాపారులకు లేని స్థిర నివాసం రెండు పేర్లు ఉన్న సింగరేణి కార్మికుల్లో గందరగోళం తమ ఓట్లు గల్లంతవుతాయేమోనని ఆందోళన
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
ఉమ్మడి జిల్లాలోని ఓటరు జాబితా ప్రక్షాళనకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) చేపట్టిన ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్/ ఎన్నికల జాబితా విస్తృత సవరణ) ప్రక్రియ వడివడిగా ముందుకు సాగుతోంది. దేశంలో నిజమైన పౌరులను గుర్తింపే లక్ష్యంగా మొదలైన ఈ ప్రక్రియపై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొన్ని వర్గాలు సర్వేను స్వాగతిస్తుండగా.. మరికొన్ని వర్గాలు సర్వేపై ఆందోళన, అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తర భారతదేశంలోని పొరుగు దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల్లో విజయవంతంగా నిర్వహించిన కేంద్రం.. తెలంగాణలోనూ ఈ ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందుకు బూత్ లెవల్ ఆఫీసర్లు(బీఎల్వో) క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. పలు ప్రాంతాల్లో సర్వేపై ఆందోళనలు వ్యక్తమవుతున్నా యి. ఎవరు నిజమైన ఓటరు.. ఎవరు కాదు? ఎవరు కొత్త ఓటరు.. ఎంతకాలం నుంచి నివసిస్తున్నారన్న అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు.
ఏమిటీ సర్వే?
భారత పౌరుల ఓటరు నిర్ధారణకు ప్రారంభించిన సర్వే ఇది. ఇందులో 2002 ఓటరు జాబితా 2025 ఓటరు జాబితాను పక్కపక్కన పెట్టుకుని వివరాలు సరిపోలుస్తూ.. స్థానికంగా ఓటర్లు నివసిస్తున్నారా? లేదా.. ప్రస్తుత డేటాతో పాత డేటా మ్యాచ్‌అవుతుందా లేదా చూస్తున్నారు. దీన్ని మ్యాపింగ్ అని పిలుస్తున్నారు. 2002, 2025 ఓటర్ల జాబితాలో (రెండింటిలో) పేర్లు ఉన్నవారు మొదటి కేటగిరీగా, 2002 ఓటరు జాబితాలో లేకుండా 1987కు ముందు జన్మించిన వారు రెండో కేటగిరీగా, 2002 ఓటరు జాబితాలో లేని , 1987 నుంచి 2004కు మధ్యలో పుట్టిన వారు మూడో కేటగిరీగా, 2004 తరువాత జన్మించిన వారు నాలుగో కేటగిరీగా విభజించారు. ఉదాహరణకు 2002లో దంపతులకు ఓటు ఉందనుకోండి. వారికి పుట్టిన పిల్లలకు, వారి మనవలకు ఓటుపై ఎలాంటి వివాదం ఉండదు. ఇలాంటి ఓట్లను వివాదం లేని గ్రీన్ కేటగిరీలో వేస్తున్నారు. ఇందుకోసం పాత పోలింగ్ స్టేషన్, ఓటు నంబర్లను పోల్చి చూస్తున్నారు. వాటి ఆధారంగా పురుషులు, సీ్త్రలు, ట్రాన్స్‌జెండర్ల వివరాలను అప్‌డేట్ చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లా ఓటర్ల వివరాలు
నియోజకవర్గం ఓట్లు
కరీంనగర్ 3,68,166
చొప్పదండి 2,35,849
మానకొండూరు 2,26,385
హుజురాబాద్ 2,52,351
రామగుండం 2,19,723
మంథని 2,39,699
పెద్దపల్లి 2,57,192
కోరుట్ల 2,48,270
జగిత్యాల 2,39,114
ధర్మపురి 2,33,182
సిరిసిల్ల 2,23,115
వేములవాడ 2,13,284
ఆందోళన ఏమిటి?
ఓటర్ల తనిఖీలో భాగంగా 2002లో ఉన్న ఇంటి పెద్దలు 2025లో ఉన్నారా? వారి పిల్లలు, మనవల పేర్లు చూస్తున్నారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ, నేటి గ్లోబలైజేషన్ కాలంలో స్థిర నివాసాలు తగ్గిపోతున్నాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు, జీవనోపాధి, వలసలు, వివాహా లు తదితరతో పలు కుటుంబాలు రెండు, మూ డు దశాబ్దాల్లో పలు చిరునామాలు మార్చాల్సి వస్తోంది. స్థానచలనంతో ఇళ్లు మారిన వారిలో ఆందోళన మొదలైంది. ఇలాంటి వారి ఓట్ల విషయంలో ఓటర్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివాహాలు అయి ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారి పేర్లు 2002 జాబితాలో సరిపోల్చే సమయంలో తమ ఓటర్లు మిస్సవుతాయని ఆందోళన చెందుతున్నారు. చాలామంది కూలీలు తమ పాత పోలింగ్ స్టేషన్, ఇంటి నంబరు వివరాలు చెప్పలేకపోతున్నారు. ఉమ్మ డి జిల్లాకు ఉన్న మరో ప్రత్యేకత సింగరేణి గనులు. ఇక్కడ పదవీ విరమణ పొందిన వేలాది మంది కార్మికులు ఉన్నారు. వీరిలో పావు వంతు రెండు పేర్లు కలిగి ఉన్నారు. వీరి ఓట్ల విషయంలోనూ గందరగోళం నెలకొంది. ఈ వివరాలపై అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నిచంగా అందుబాటులోకి రాలేదు. ఎస్‌ఐఆర్ సర్వే అనుకున్నంత వేగంగా కాకుండా వడివడిగానే సాగుతోంది. ఇప్పటివరకు కరీంనగర్‌లో 20 శాతం, పెద్దపల్లిలో 18 శాతం, జగిత్యాలలో 19 శాతం, సిరిసిల్లలో 16శాతం మేర పూర్తయింది.


