పోలీసులకు రాజోలు టీడీపీ ఇన్‌చార్జి అమూల్య ఫిర్యాదు
కోనసీమ జిల్లా: భర్త తనను వేధిస్తూ అదనపు కట్నం కోసం డిమాండ్ చేస్తున్నాడని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గొల్లపల్లి అమూల్య రాజోలు (Razole) పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఆమె భర్త దొమ్మేటి సునీల్‌పై రాజోలు ఎస్‌ఐ రాజేష్ కుమార్ కేసు నమోదు చేశారు. ఈ విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది.
చదువుకునే రోజుల్లో సహ విద్యార్థి అయిన సునీల్ తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటానని నమ్మించాడని దీంతో పెద్దల సమక్షంలో 2009 మార్చి 4న తమకు వివాహమైందని, అప్పటి నుంచీ భర్త సునీల్ తనపై వేధింపులకు పాల్పడుతున్నాడని పోలీసులకు అమూల్య ఫిర్యాదు చేశారు.
తనపై రెండు పర్యాయాలు హత్యాయత్నానికి కూడా పాల్పడ్డాడని, కొన్ని ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో (Social Media) పోస్టు చేస్తానంటూ బెదిరిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.


