ఆప్కో బకాయిలు విడుదల చేయాలి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఆరు సంవత్సరాల నుంచి చేనేత సహకార సంఘాలకు ఆప్కో బాకీ ఉన్న డబ్బు వెంటనే విడుదల చేయాలని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు పప్పు దుర్గారమేష్ అన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా చేనేత సహకార సంఘాల సమావేశం సోమవారం స్థానిక ఉమారామలింగేశ్వర స్వామి కల్యాణ మండపంలో నిర్వహించారు. సుమారు 40 సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘాల నుంచి వస్త్రాలు కొనుగోలు చేయాలన్నారు. చేనేతల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వానికి చేనేతలకు అడ్డంకిగా వ్యవహరిస్తూ, అన్యాయం చేస్తున్న ఆప్కో ఎండీ, హ్యాండ్లూమ్ కమిషనర్ రేఖారాణిని ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. సంక్రాంతి లోపు ఆప్కో బకాయిలు విడుదల చేయకపోతే రిలే నిరాహార దీక్షలతో మొదలు పెట్టి ఆమరణ నిరాహార దీక్షకు ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. ఆప్కో డైరెక్టర్ మాజీ ముప్పన వీర్రాజు, చేనేత కార్మిక సంఘం నాయకులు నల్లా రామారావు, అల్లక రాజు, దొంతంశెట్టి సత్యప్రకాష్ పాల్గొన్నారు.


