నీ చేయి పనిచేయదు.. పెన్షన్ రాద్దాంలే...
● జీజీహెచ్ వైద్యుల నిర్వాకంతో చేయి కోల్పోయిన
బాధితుడు
● ఎందుకిలా చేశారని ప్రశ్నిస్తే పెన్షన్ రాస్తానని
చెప్పిన డాక్టరు
కాకినాడ క్రైం: సర్జరీ తేడాగా జరిగింది, నీ చేయి పనిచేయదు, పెన్షన్ రాద్దాంలే... ఇదీ వైద్యుల నిర్లక్ష్యం వల్ల తన చేతిని కోల్పోయిన ఓ పేద రోగికి జీజీహెచ్ వైద్యులు ఇచ్చిన సమాధానం. నిక్షేపంగా ఉన్న తన చేతిని చచ్చుపడేలా చేశారని బాధితుడు వాపోయాడు. కలెక్టర్‌ను కలిసి ఆధారాలు అందించి తన గోడును వెళ్లబోసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది మార్చి 18న పెదపూడి మండలం కై కవోలు గ్రామానికి చెందిన 42 ఏళ్ల పెరుగుల వెంకటరమణ ద్విచక్ర వాహనం స్టాండ్ వేస్తూ పడిపోయాడు. ఈ ఘటనలో అతడి కుడి చేతికి గాయమైంది. తన తమ్ముడు రాధాకృష్ణ సాయంతో కాకినాడ జీజీహెచ్‌లో చేరాడు. వైద్యులు అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందించి కట్టు కట్టారు. అదే రోజు వార్డులో ఉంచి తర్వాత రోజు ఉదయం డిశ్చార్జి చేశారు. రెండు వారాల్లో మళ్లీ రావాలని చెప్పారు. వైద్యుల సూచన మేరకు, వెంకటరమణ రెండు వారాల తర్వాత వస్తే ఏప్రిల్ 7న శస్త్రచికిత్స నిర్వహించారు. అప్పటి నుంచి బాధితుడి కుడి చేయి మెల్లగా అచేతనంగా మారుతూ వచ్చింది. చిటికెన వేలు అయితే పూర్తిగా ముడుచుకుపోయింది. మరుసటి రోజు నుంచి నొప్పి తీవ్రమవడం మొదలు పెట్టింది. వైద్యులు ఫర్వాలేదు సర్దుకుంటుంది అని చెప్పి ఏప్రిల్ 12న డిశ్చార్జి చేశారు. కట్టు విప్పడానికి మే 2న రమ్మంటే వెళ్లాడు. కట్టు విప్పిన తర్వాత తన చేయిని కదపలేకున్నానని, చిటికెన వేలు పూర్తిగా ముడుచుకుపోయిందని చెబితే ఫిజియో థెరపీ అవసరం అన్నారు. జీజీహెచ్ సహా స్వగ్రామంలో ఉన్న ఫిజియోథెరపీల వద్దకు ఎన్నిసార్లు వెళ్లినా ఫలితం లేకపోయింది. నెలలు గడుస్తున్న కొద్దీ చేయి పూర్తిగా నిస్సత్తువతో కదల్లేని స్థితికి చేరింది. చివరికి బాధితుడు రాయవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యుడు సర్జరీ సమయంలో పెద్ద పొరపాటే జరిగిందని, మోచేతిలో బాల్ వంటి నిర్మాణాన్ని తీసేశారని చెప్పారు. దీంతో కంగుతిన్న బాధితుడు ఆందోళనతో ఈ నెల 8న జీజీహెచ్ సూపరింటెండెంట్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి, ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును ఆర్థోపెడిక్ వైద్యుడు శివానందంకు పంపించారు. శివానందం నివేదికలు పరిశీలించి సర్జరీలో తేడా జరిగింది. నీ చేయి రాదు, కావాలంటే పెన్షన్ పెడదాం లే అన్నారు. కంగుతిన్న బాధితుడు సోమవారం కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌లో తన సమస్యను కలెక్టర్‌కు నివేదించాడు. కలెక్టర్ దీనిపై విచారించాలని జీజీహెచ్ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. శస్త్రచికిత్స వేళ తనను ఆపరేషన్ థియేటర్ నుంచి వార్డుకు తరలించేందుకు రూ.600 వసూలు చేశారని వాపోయాడు. తనకు 12,10 ఏళ్ల వయసున్న ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని తెలిపాడు. తన కుడి చేయి పూర్తిగా పనిచేయడం మానేయడం వల్ల బతుకుదెరువు కోల్పోయి తన కుటుంబం రోడ్డున పడిందని బాధితుడు రోదించిన తీరు కలచి వేసింది.


