ఈ ‘తిక్క’కు లెక్కుందా?
సచివాలయ భవనానికి సర్పంచ్ పేరు ఏర్పాటుపై గ్రామస్తుల విస్మయం
అల్లవరం: సోషల్ మీడియాలో నిత్యం పోస్టులు పెడుతున్న ఎంట్రుకోన సర్పంచ్ తిక్కిరెడ్డి నాగవెంకట శ్రీనివాసరావు పబ్లిసిటీ పరాకాష్టకు చేరింది. ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన సచివాలయ భవనానికి ఏకంగా తన పేరును చెక్కించుకుని గ్రామస్తులను విస్మయానికి గురి చేశారు. ప్రహరీకి ఆర్చీ నిర్మించి, తను సర్పంచ్ పదవిలో బాధ్యతలు తీసుకున్న తేదీని ముద్రించారు. మాజీ సర్పంచ్ పేరిట ఉన్న ఇనుప గేటుని తొలగించి తన పేరిట ఇనుప గేటు పేరుని ఏర్పాటు చేశారు. గతంలో ఈ సర్పంచ్ జనసేన జెండాను సచివాలయం భవనంపై ఏర్పాటు చేయగా అధికారులు స్పందించి వెంటనే తొలగించారు.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణం
సుమారు రూ.24 లక్షలతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో సచివాలయ భవనాన్ని నిర్మించి ప్రజలకు అంకితం చేశారు. ప్రహరీ కూడా ప్రభుత్వ నిధులతోనే నిర్మించారు. ప్రభుత్వ భవనానికి సర్పంచ్ తన పేరుని ఎలా ఏర్పాటు చేసుకుంటారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి దీన్ని వెంటనే తొలగించారు. అయితే అది ప్రభుత్వ భవనమా? సర్పంచ్ నిధులతో నిర్మించిన భవనమా? తేల్చాలని ప్రజలు నిలదీస్తున్నారు. దీనిపై ఎంపీడీఓ గౌరికుమారిని వివరణ కోరగా ఈ విషయంపై కార్యదర్శి జ్యోతిని ఇప్పటికే అడిగానని, తాను పరిశీలించి చర్యలు తీసుకుంటానని తెలిపారు.
వలస కార్మికురాలిని ఇంటికి చేర్చిన కేసీఎం
అమలాపురం రూరల్: ఉపాధి నిమిత్తం మస్కట్ వెళ్లి తీవ్ర ఇబ్బందులకు గురైన కాకినాడ జిల్లా పిఠాపురం మండలం ధర్మవరం గ్రామానికి చెందిన వలస కార్మికురాలు పళ్ళ సోమలమ్మను కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ (కేసీఎం) అధికారులు క్షేమంగా ఇంటికి తీసుకువచ్చారు. సోమలమ్మ ఫిబ్రవరి 2025లో మస్కట్ దేశానికి వెళ్లగా అక్కడ పనిచేసే చోట తీవ్ర శారీరక, మానసిక వేధింపులకు గురయ్యారు. సరైన ఆహారం, విశ్రాంతి లేకుండా చిత్రహింసలు పెట్టారని, ఇంట్లో నిద్రపోవడానికి అనుమతించకపోవడంతో బయట దోమల మధ్య, తేళ్ల భయంతో తన తల్లి విదేశాల్లో అవస్థలు పడుతున్నారని ఆమె కుమారుడు అరుణ్‌కుమార్ కలెక్టర్ మహేష్‌కుమార్‌కు అర్జీ సమర్పించారు. స్పందించిన కలెక్టర్ తక్షణ చర్యలు తీసుకోవాలని కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్‌కు ఆదేశాలు జారీ చేశారు. కేసీఎం బృందం సంబంధిత అధికారులతో సమన్వయం చేసి సోమలమ్మను క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చినట్లు కేంద్ర నోడల్ అధికారి కె.మాధవి, సమన్వయ అధికారి గోళ్ళ రమేష్ సోమవారం తెలిపారు.
ఈ ‘తిక్క’కు లెక్కుందా?


