కల్యాణం.. ప్రతి తంతూ కళాత్మకం

Weddings changed trend with photo and video shoots - Sakshi

మొదలవుతున్న వివాహాల సందడి

పెళ్లిళ్లకు అదనపు హంగులు.. ఆకర్షణలు

తీర్చిదిద్దుతున్న శ్రామికులెందరో

ఫొటో, వీడియో షూట్‌లతో మారిన పంథా

సాక్షి అమలాపురం: పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఇదో మధుర ఘట్టం. కొత్త జీవితానికి నాంది పలికే శుభదినం. మరి ఆ ముచ్చట సాదాసీదాగా జరిగిపోతే ఎలా! వివాహంలో నయనానందకరంగా సాగే ప్రతి తంతూ జీవితాంతం సుమధుర జ్ఞాపకాలుగా మిగిలిపోవాలంటే కాస్త వెలుగు జిలుగులు అద్దాల్సిందే. పెళ్లంటే తాళిబొట్లు.. తలంబ్రాలు.. పూలదండలు.. ఆభరణాలు.. వేదమంత్రాలు.. సన్నాయి మేళాలు.. షడ్రుచుల భోజనాలే కాదు.. ఇప్పుడా సందడి సరికొత్త శోభను అద్దుకుంటోంది. ప్రతి తంతూ కళాత్మకంగా మారిపోతోంది.

మనోఫలకంపై బలమైన ముద్ర వేస్తోంది. పెళ్లిలో జరిగే ప్రతి ఘట్టంలో వాడే వస్తువులు, వాటి తయారీ వెనుక ఉన్న శ్రామికుల పనితనం.. చేయి తిరిగి నైపుణ్యం గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఫొటో, వీడియో షూట్‌ల ప్రాధాన్యం పెరిగిన తరువాత పెళ్లిలో వాడే ప్రతి వస్తువునూ అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. మూడు నెలల మూఢం కొద్ది రోజుల్లో ముగిసిపోతోంది. పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభ కాబోతోంది. ఈ తరుణాన వివాహ వస్తువులు తయారు చేసేవారు బిజీగా మారిపోయారు.

ఎన్నో డెకరేషన్లు
► వధూవరుల మంగళ స్నానాలకు చేస్తున్న డెకరేషన్లే చిన్న సైజు పెళ్లిని తలపిస్తున్నాయి. పసుపు నీళ్లు వేసేందుకు అందాల జల్లెడ.. సప్తవర్ణ శోభితమైన బిందెలు.. మహారాజుల వైభవాన్ని గుర్తుకు తెచ్చే కంచు పాత్రలు.. వాటిలో పన్నీరు కలిపిన నీళ్లు.. అందులో తేలియాడే రంగురంగుల పూలతో కొత్త వన్నెలు అద్దుతున్నారు.
► బాసికాలు.. పెళ్లి కుమారునికి అలంకరించే మహారాజా తలపాగాలు.. సంప్రదాయ టోపీలు.. కాళ్లకు తొడిగే పాముకోళ్లు.. రోళ్లు.. రోకళ్లకు రకరకాల రంగులతో ముస్తాబులు.. పెళ్లి కుమార్తెకు కొత్తందాన్ని తెచ్చే అలంకరించే పూలజడలు.. ఖరీదైన జాకెట్లు.. చేతులకు కళాత్మక మెహందీలు.. ముఖానికి ఫేషియల్స్‌.. పెళ్లి కుమార్తెను తీసుకు వెళ్లే బుట్ట.. గొడుగు.. ఇలా వివాహ వైభవంలో ఎన్నో నూతన ఆకర్షణలు బంధుమిత్రులను కట్టిపడేస్తున్నాయి.
► శాస్త్ర సమ్మతమా కాదా అనే విషయాన్ని పక్కన పెడితే.. వివాహ సమయంలో వధూవరుల మధ్య ఏర్పాటు చేసే తెరను సైతం అందంగా తీర్చిదిద్దుతున్నారు. వాటి మీద సీతారాములు, అలమేలుమంగా సమేత వేంకటేశ్వర స్వామి వంటి దేవతలను లేసు దారాల అల్లికలతో తీర్చిదిద్దుతూ.. ఆ సమయానికి దైవానుగ్రహం ప్రసరిస్తుందనే భావన కలిగిస్తున్నారు.
► వివాహ సమయంలో వధూవరుల చేతుల్లో పెట్టే కొబ్బరి బొండాలకు ముత్యాలు, పగడాలు, కెంపులతో కొత్త ఆకర్షణలు తీసుకువస్తున్నారు.
► సంప్రదాయ కర్పూర దండలు కొత్త రూపాల్లో కనువిందు చేస్తున్నాయి.
► తలంబ్రాలకు వాడే కొబ్బరి చిప్పలను సైతం అద్భుతంగా ముస్తాబు చేస్తున్నారు.
► వధూవరులతో పాటు పెళ్లి తంతులో జరిగే ప్రతి కార్యక్రమానికీ వినియోగించే ప్రతి వస్తువునూ ఎంతో మంది అద్భుత ప్రతిభతో కళ్లు తిప్పుకోలేని రీతిలో ముస్తాబు చేస్తున్నారు.

ఫొటో షూట్‌లు వచ్చాక ఆకర్షణకు ప్రాధాన్యం
పెళ్లికూతుళ్ల ముస్తాబు నుంచి కార్ల డెకరేషన్‌ వరకూ ప్రతి దానికి అదనపు ఆకర్షణలు అద్దుతున్నారు. ఫొటోల కోసం ప్రతి వస్తువునూ అందంగా తీర్చిదిద్దుతున్నారు. వధూవరుల అలంకరణే చిన్న సైజు పెళ్లిని తలపిస్తుంది.
– శ్రీపతి ప్రకాష్, కల్వకొలను వీధి, అమలాపురం 

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top