ఆత్మ బంధువులు: మానవత్వమే ‘చివరి తోడు’ 

Voluntary Service Organizations Conducting Funerals For Those Who Died With Corona - Sakshi

కరోనా మృతులను వదిలేస్తున్న కుటుంబీకులు

అన్నీతామై అంత్యక్రియలు నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థలు  

పేరున్న కుటుంబం.. ఊరంతా బంధువులే.. కానీ కరోనా వచ్చి మృత్యువాత పడితే పట్టించుకునే వారే ఉండరు. అయినవారే కాదనుకుని వెళ్లిపోతుండగా.. ముక్కూమొహం తెలియని వారే మానవత్వం చూపుతున్నారు. అన్నీతామై అంతిమసంస్కారాలు చేస్తున్నారు. ఏ జన్మసంబంధమో తెలియదు గానీ చితికి నిప్పుపెట్టో.. గుప్పెడు మట్టి పోసో ఆత్మబంధువులవుతున్నారు.

ముదిగుబ్బ/కదిరి/నల్లమాడ: బంధాలను కరోనా మహమ్మారి చిన్నాభిన్నం చేస్తోంది. మానవత్వం మంట గలుస్తోంది. అంతవరకూ తామున్నామంటూ భరోసా ఇచ్చిన వారే పాజిటివ్‌ వచ్చిందనగానే దూరమైపోతున్నారు. ఇక కరోనా కాటుకు బలైపోతే అంత్యక్రియలు చేసేందుకూ వెనుకాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొందరు యువకులు ఆత్మబంధువులయ్యారు. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి అంతిమసంస్కారాలు నిర్వహిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

కృష్ణమ్మకు ‘హెల్పింగ్‌ హ్యాండ్స్‌’ 
ముదిగుబ్బకు చెందిన కృష్ణమ్మ (65) కరోనాతో పోరాడి బుధవారం తుదిశ్వాస విడించింది. అయితే ఆమె అంత్యక్రియలను నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న ‘ఇస్లామిక్‌ హెల్పింగ్‌ హ్యాండ్స్‌’ ప్రతినిధులు అమీర్, బాబా, తలహ, ఆదిల్, సుజార్‌లు ముందుకొచ్చారు. వృద్ధురాలి అంత్యక్రియలను హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. 

భార్యా కుమారుడు ముఖం చాటేసినా... 
కదిరి రూరల్‌ మండలం నాగూరుపల్లికి చెందిన ఆంజనేయులు(45) కొన్నేళ్లుగా నల్లమాడలో ఒంటరిగా ఉంటూ భవన నిర్మాణ కారి్మకుడిగా జీవనం సాగించేవాడు. కొన్నిరోజులుగా జ్వరం, దగ్గు, ఆయాసం అధికం కావడంతో బుధవారం స్థానిక కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు వెళ్లి కరోనా పరీక్ష చేయించుకున్నాడు. అనంతరం ఆస్పత్రి బయట అరుగుపై కూర్చొని మధ్యాహ్నం 3 గంటల సమయంలో అక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న భార్య, కుమారుడు నల్లమాడకు చేరుకున్నారు. కరోనా సోకవడం వల్లే ఆంజనేయులు మృతిచెందినట్లు ఆస్పత్రి ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ రామకృష్ణ తెలిపారు. నిబంధనల మేరకు అంత్యక్రియలు నిర్వహించాలని సూచించారు.

భయాందోళన చెందిన వారు ఆంజనేయులు మృతదేహాన్ని అక్కడి వదిలిపెట్టి వెళ్లిపోయారు. దీంతో ఆ రాత్రి, గురువారం ఉదయం వరకు సుమారు 20 గంటల పాటు మృతదేహం ఆస్పత్రి ఆవరణలోనే ఉండిపోయింది. సమాచారం అందుకున్న పంచాయతీ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, స్థానిక పోలీసుల సహకారంతో ఓడీ చెరువుకు చెందిన ‘హెల్పింగ్‌ హ్యాండ్స్‌ తలబా’ స్వచ్ఛంద సంస్థ సభ్యులు, పంచాయతీ పారిశుధ్య కారి్మకులతో కలిసి ఆంజనేయులు అంత్యక్రియలను నిర్వహించారు.

కుటుంబీకులే భయపడినా.... 
కదిరి: కదిరి మున్సిపల్‌ పరిధిలోని కుటాగుళ్లకు చెందిన ఓ వ్యక్తి బుధవారం కరోనాతో మృతి చెందాడు. అయితే వైరస్‌ భయంతో కుటుంబీకులు ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు వెనుకాడారు.  విషయం తెలుసుకున్న కదిరి పట్టణానికి చెందిన నిజాంవలీ, ఇర్ఫాన్‌ఖాన్, ఆషిక్, సాదిక్‌ బాషా, ఇర్షాద్, అక్బర్‌ఖాన్‌ మరికొందరు వెంటనే అక్కడికి చేరుకుని ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. వారం రోజుల క్రితం కూడా అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో చనిపోవడంతో అంతిమ సంస్కారాలు చేశారు. తమకు కుల, మత భేదాలు లేవని ఎవరైనా తమను సాయం అర్థిస్తే తమ సొంత ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహిస్తామని బృందంలోని సభ్యుడు అక్బర్‌ ‘సాక్షి’ తెలియజేశారు.

చదవండి: వ్యాక్సిన్‌ కోసం ఎంత ఖర్చుకైనా సిద్ధమే 
1.81 లక్షల ఎకరాలకు ‘సత్వర’ ఫలాలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top