
జూన్ 21న ముఖ్య అతిథిగా పాల్గోనున్న ప్రధాని మోదీ
ఈ నెల 29 నుంచి నాలుగు వారాల ప్రచార కార్యాచరణ
జూన్ 5 నుంచి వారం పాటు నియోజకవర్గాల్లో ప్రచారం
జూన్ 17 నుంచి విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు
సాక్షి, విశాఖపట్నం: ప్రధాని నరేంద్రమోదీ వచ్చే నెలలో విశాఖలో పర్యటించనున్నారు. జూన్ 21న విశాఖ వేదికగా ‘యోగా ఫర్ వన్ ఎర్త్.. వన్ హెల్త్’థీమ్‌తో నిర్వహించనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 6 నుంచి 8 గంటల మధ్యలో సుమారు 45 నిమిషాల పాటు జరగనున్న యోగాసనాల కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, యోగా అభ్యాసకులు, ఉద్యోగులు, సాధారణ పౌరులు, డిఫెన్స్ స్టాఫ్, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ, క్రీడాకారులు, ఇతర సంస్థల కార్యకర్తలు సహా సుమారు 2.5 లక్షల మంది భాగస్వామ్యం కానున్నారు.
ఇందుకోసం జిల్లా యంత్రాంగం 24 చదరపు అడుగులకు ఒకరు చొప్పున కూర్చునేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి చోటా 3 నుంచి 4 వేల మంది యోగాసనాలు వేసేలా అనువైన మైదానాలను గుర్తిస్తున్నారు. ప్రధానితో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రముఖులు స్థానిక ఆర్కే బీచ్ రోడ్ లేదా ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరిగే ప్రధాన వేడుకలో భాగస్వామ్యం కానున్నారు.
ఈ నెల 29 నుంచి నాలుగు వారాల పాటు యోగా దినోత్సవంపై ప్రచారం చేస్తారు. జూన్ 5 నుంచి వారం రోజుల పాటు ప్రతి నియోజకవర్గంలోనూ, 17 నుంచి విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రతి ఒక్కరినీ ప్రధాని కార్యక్రమంలో భాగస్వామ్యం చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు.