ఉక్కురి బిక్కిరి | Visakhapatnam Steel Plant is moving fast towards privatization | Sakshi
Sakshi News home page

ఉక్కురి బిక్కిరి

Aug 18 2025 5:35 AM | Updated on Aug 18 2025 5:35 AM

Visakhapatnam Steel Plant is moving fast towards privatization

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు బిగుస్తున్న ప్రైవేటు సంకెళ్లు

ఊపందుకున్న విభాగాల ప్రైవేటీకరణ

ఒకే రోజు 32 ఈఓఐలు విడుదల 

పట్టించుకోని కూటమి నేతలు

సాక్షి, విశాఖపట్నం:  కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించిన విధంగానే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై వేగంగా అడుగులు వేస్తోంది. ఒక్కో విభాగానికి ఉక్కుసంకెళ్లు బిగిస్తోంది. దీనికి నిదర్శనంగా ఒకే రోజు 32 ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంటరెస్టు(ఈవోఐ)లను విడుదల చేసింది. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగదని పదేపదే చెబుతున్న కూటమి నేతలు, ఇప్పుడు కేంద్రం చర్యలు వేగవంతం చేసినా పట్టించుకోకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. 

గతంలో కేవలం మొత్తం నిర్వహణ (టోటల్‌ మెయింటెనెన్స్‌) పనులను మాత్రమే ప్రైవేటు వారికి అప్పగించగా, ఇప్పుడు ఏకంగా పలు విభాగాల నిర్వహణ కోసం ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) విడుదల చేయడం ద్వారా కేంద్రం ప్రైవేటీకరణ వైపు దూకుడుగా వెళ్తోందని స్పష్టమవుతోంది. శనివారం ఒక్కరోజే ప్లాంట్‌లోని పలు విభాగాల నిర్వహణ, మెయింటెనెన్స్‌ కోసం 32 ఈవోఐలు విడుదల అయ్యాయి. ఇప్పటికే ఆర్‌ఎంహెచ్‌పీ, సింటర్‌ ప్లాంట్‌ మెయింటెనెన్స్‌కు ఈవోఐలు జారీ చేసిన కేంద్రం.. ఇప్పుడు «థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌–1, థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌–2, ఎస్‌ఎంఎస్‌ సీసీఎం–4, మాధారం మైన్స్, ఫౌండ్రీ, సెంట్రల్‌ మెషిన్‌ షాప్‌ వంటి అనేక ఇతర విభాగాలకు కూడా విడుదల చేసింది. 

ఎన్నికలకు ముందు స్టీల్‌ప్లాంట్‌ను కాపాడతామని వాగ్దానం చేసిన కూటమి నేతలు గెలిచిన తర్వాత పట్టించుకోవడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఒత్తిడి పెరగడంతో ’ప్యాకేజీ’ అంటూ కొత్త నాటకం మొదలుపెట్టారని, ఆ ప్యాకేజీలో భాగంగా ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం మూడు బ్లాస్ట్‌ఫర్నేస్‌లు నడపడం, శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులను గణనీయంగా తగ్గించడం వంటి చర్యలు ప్రారంభించారని వారు విమర్శిస్తున్నారు. అంతేకాకుండా, ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలను తగ్గించి, గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటికీ పూర్తి జీతాలు చెల్లించడం లేదని, 33 శాతం జీతం పెండింగ్‌లో పెట్టా­రని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. 

ఈవోఐలు అమల్లోకి వస్తే మరింత మంది శాశ్వత ఉద్యోగులను తొలగించే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీని ద్వారా తక్కువ మంది శాశ్వత ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ కార్మికులతో ప్లాంట్‌ను పూర్తిగా ప్రైవేటీకరించేందుకు కేంద్రం వేగంగా చర్యలు తీసుకుంటుందని కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఈవోఐలు ఉపసంహరించాలి 
ఈవోఐలు జారీ చేయడం అంటే ప్రైవేటీకరణకు మార్గం చేయడమే. ప్రభుత్వం ప్యాకేజీ ఇచ్చేది ప్రైవేటేజేషన్‌ చేయడానికి అన్నట్టు ఉంది. పర్మినెంట్‌ సిబ్బంది నియామకాలు చేపట్టి ప్లాంట్‌ను వారితో నడిపించాలి. యాజమాన్యం వెంటనే ఈఓఐలు ఉపసంహరించాలి.  – కె.ఎస్‌.ఎన్‌.రావు, స్టీల్‌ ప్లాంట్‌ గుర్తింపు యూనియన్‌ అధ్యక్షుడు 

ప్రైవేటు వారికి అప్పగించే కుట్రలో భాగం 
గతంలో మెయింటెనెన్స్‌ పనులకు ప్రైవేటు టెండర్లు పిలిచేవారు. ఇప్పుడు ప్రధాన విభాగాల నిర్వహణ కూడా ప్రైవేటు వారికి అప్పగించే యత్నమే ఈవోఐలు విడుదల. ప్యాకేజీ ఇచ్చామన్న ప్రభు­­త్వం ప్లాంట్‌ను ప్రభుత్వరంగంగా పటిష్టం చేయడం పోయి ఇలాంటి చర్యలకు దిగడం దుర్మార్గం.   – మంత్రి రాజశేఖర్, స్టీల్‌ ఐఎన్‌టీయూసీ నేత

ప్లాంట్‌ను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకే..
స్టీల్‌ ప్లాంట్‌ను వారికి నచ్చిన ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకే ఈవోఐలు విడుదల చేశారు. ఇదే జరిగితే స్టీల్‌ ప్లాంట్‌ భవిష్యత్తు తరాలకు ఈ రూపంలో ఉండదు.   దీనిపై కూటమి ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు స్పందించాలి. ఈ అంశంపై ఎటువంటి పోరాటానికైనా సీఐటీయూ సిద్ధంగా ఉంది.  – జె.అయోధ్యరామ్, గౌరవాధ్యక్షులు, స్టీల్‌ సీఐటీయూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement