ఐటీ హబ్‌గా విశాఖ

Visakhapatnam Grow Into Major IT Hub In Andhra Pradesh - Sakshi

ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీ పార్క్, ఐకానిక్‌ ఐటీ టవర్ల నిర్మాణం

పెట్టుబడుల ఆకర్షణకు రోడ్‌ షోలు, త్వరలో భారీ ఇన్వెస్ట్‌మెంట్‌ సదస్సు

సాక్షి, అమరావతి : గ్రేటర్‌ విశాఖ నగరం ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) హబ్‌గా మారనుంది. వచ్చే మూడేళ్లలో కనీసం 25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు విశాఖను ఐటీ హబ్‌గా మార్చడానికి ఐటీ శాఖ వేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం రూ.200 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్న విశాఖ మిలీనియం టవర్‌ ‘ఏ’లో 2.04 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉండగా, టవర్‌ ‘బీ’లో మరో 1.3 లక్షల చదరపు అడుగుల స్థలం త్వరలోనే అందుబాటులోకి రానుంది.

టవర్‌ ‘ఏ’లో ఇప్పటికే 1.04 లక్షల చదరపు అడుగుల్లో వివిధ కంపెనీలు ఉండగా, మరో లక్ష చదరపు అడుగులు అందుబాటులో ఉన్నాయి. దీనికి అదనంగా విశాఖలో భారీ ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీ పార్కులో ఐకానిక్‌ టవర్ల నిర్మాణం ద్వారా 25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి తీసుకురావడానికి ఐటీ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసం విశాఖ సమీపంలో అందుబాటులో ఉన్న భూములను వినియోగించుకోనున్నారు. ఈ ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీ పార్కులో స్థానిక యువతకు ఉపాధి లభించే విధంగా ఐటీ స్కిల్‌ యూనివర్సిటీ, ఇంకుబేషన్‌ సెంటర్లు, సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీలు, కో–వర్కింగ్‌ ప్లేస్‌లతో పాటు ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో పని చేసుకునే విధంగా ఈ పార్కులను అభివృద్ధి చేయనున్నారు.

డిసెంబర్‌ నాటికి 10,000 ఉద్యోగాలే లక్ష్యం
ఈ ఏడాది ఐటీ రంగంలో 30,000 మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడమే కాకుండా ఈ డిసెంబర్‌ నాటికి 10,000 మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 
ఇందుకోసం వివిధ కంపెనీలతో చర్చలు జరపడంతో పాటు ప్రతీ నెలా రోడ్‌షోలు నిర్వహించనున్నారు. త్వరలోనే ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించే విధంగా భారీ ఇన్వెస్ట్‌మెంట్‌ సదస్సును నిర్వహించనున్నారు. 
ఇప్పటికే అదానీ గ్రూపు విశాఖలో 200 మెగా వాట్ల డేటా సెంటర్‌ ఏర్పాటుతో పాటు సిŠక్‌ల్‌ యూనివర్సిటీ, ఐటీ పార్కుల నిర్మాణం ద్వారా కనీసం 25,000 మందికి ఉపాధి కల్పించే విధంగా ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. 
విశాఖతో పాటు కాకినాడ, మంగళగిరి, తిరుపతి, అనంతపురం ప్రాంతాల్లో ఐటీ పెట్టుబడులను ఆకర్షించే విధంగా మౌలిక వసతులు అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్రంలో ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి సుమారు 1,000 నుంచి 2,000 ఎకరాల్లో విశాఖ, తిరుపతి, అనంతపురంలో ఐటీ కాన్సెప్ట్‌ సిటీలను అభివృద్ధి చేయాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top