
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని యారాడ బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన ఇద్దరు విదేశీయులు.. అలలు ఎగసిపడటంతో కొట్టుకుపోయారు. ఇటలీ నుంచి విశాఖకి ఇద్దరు పర్యాటకులు వచ్చారు. ఒకరు మృతి చెందగా.. మరొకరిని లైఫ్ గార్డ్స్ రక్షించారు. కేసు నమోదు చేసిన న్యూ పోర్ట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాగా, పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచే సుందర సాగర తీరం.. ఒక్కోసారి వారిపైనే ఉగ్రరూపం చూపిస్తోంది. అనూహ్యంగా రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగసిపడి కాటేస్తున్నాయి. మరోవైపు అత్యుత్సాహంతో కొందరు కెరటాలకు బలైపోతున్నారు. పోలీసులు, మెరైన్ పోలీసులు, లైఫ్‌గార్డ్స్ నిరంతరం పహారా కాస్తున్నప్పటికీ తీరంలో విషాద ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.
విశాఖ వచ్చే పర్యాటకులు యారాడ బీచ్, ఆర్కే బీచ్, తేన్నేటి పార్క్, సాగర్ నగర్, రుషి కొండ బీచ్, ఐటీ హిల్స్, భీమిలి బీచ్ ప్రాంతాలను ఎక్కువగా సందర్శిస్తుంటారు. ఇక్కడి తీరంలో పెద్ద పెద్ద రాళ్లు ఉండడంతో వాటిపై నిల్చుని సాగరం అందాలను వీక్షిస్తుంటారు. అయితే కొంత మంది సరదాగా స్నానాలు చేసేందుకు దిగడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా తీరం నుంచి ఎక్కువ దూరం సముద్రంలోకి వెళ్లడంతో.. అకస్మాత్తుగా వచ్చే అలలకు బలైపోతున్నారు.
విశాఖ తీరం చుట్టూ కొండలు ఉండడంతో వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా రిప్ కరెంట్ వల్ల ఒక్కొక్కసారి భారీ అలలు వస్తుంటాయి. ఇలా రిప్ కరెంట్ వల్ల అలలు కొన్ని మీటర్ల ఎత్తు వరకు వస్తుంటాయి. ఆ సమయంలో తీరంలో ఉన్న వారు వాటికి చిక్కితే క్షణాల్లో కొన్ని కిలోమీటర్ల లోనికి వెళ్లిపోతుంటారు. సాధారణంగా అలలు ఎవరినైనా లోనికి లాగితే కొద్ది దూరంలోనే విడిచిపెట్టేస్తాయి. అటువంటి వారిని లైఫ్‌గార్డ్స్ రక్షించే అవకాశం ఉంటుంది. ఈ రిప్ కరెంట్ వల్ల వచ్చే కెరటాలకు చిక్కితే మాత్రం సురక్షితంగా బయటపడడం అసాధ్యం.