
సాక్షి, విశాఖపట్నం: పొక్సో కేసులో ఏసీపీ చేతివాటం బయటపడింది. ఇంటర్ చదువుతున్న బాలికపై రామకృష్ణ అనే యువకుడు వేధింపులకు పాల్పడుతున్నాడు. తాను చెప్పినట్టు చేయకపోతే చంపేస్తానంటూ బాలిక ఇంటికి వచ్చి మరి.. బెదిరింపులకు దిగాడు. దీంతో తమ కూతురికి ప్రాణహాని ఉందని.. వేధింపులు భరించలేక పోతుందని హార్బర్ ఏసీపీ కాళిదాసును బాలిక తల్లిదండ్రులు ఆశ్రయించారు.
పోక్సో కేసులో సెటిల్‌మెంట్ చేసుకోవాలంటూ బాధితులపై ఏసీపీ కాళిదాసు తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. కాగా, ఏసీపీ అండతో పోలీస్ స్టేషన్‌లోనే బాధితురాలు తండ్రిపై నిందితుడు రామకృష్ణ దాడి చేశాడు. దాడి చేసినా కానీ బాధితులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఏసీపీ కాళిదాసు తీరుపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ హార్బర్ పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది.
ఇదిలా ఉండగా.. ఈ కేసులో పోలీసులు డబుల్ గేమ్ ఆడారు. పోలీస్ స్టేషన్‌లో గొడవ బయటకి రావటంతో నిందితుడికి పోలీసులు థర్డ్ డిగ్రీ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. నిందితుడి ప్రైవేట్ పార్ట్స్‌పై వేడి మైనపు చుక్కల్ని వేశారు. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. నిందితుడు రామకృష్ణ.. రిమాండ్ సమయంలో మేజిస్ట్రేట్ ఎదుట థర్డ్ డిగ్రీ విషయం బయట పెట్టాడు. పోలీసులపై మేజిస్ట్రేట్ సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలంటూ సీపీ శంఖబ్రతబాగ్చికి మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు.
